కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాల్వగడ్డ గడిగురుజు ప్రాంతంలో ఉన్న సుఫియాన్ సామిల్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీ కలప డిపోలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిపో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైరింజన్, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే డిపోలో ఉన్న కలప, కటింగ్ మెషీన్లు పూర్తిగా కాలిపోయాయి.
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, భారీగా ఆస్తినష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో భారీగా కలప, కటింగ్ మెషీన్లు కాలిపోవడంతో దాదాపు రూ. కోటి 50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సామిల్ లీజ్ ఓనర్ జాకీర్ పాషా చెప్పాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ డిపోను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.