రెణివట్ల గ్రామంలో.. రైస్ మిల్లులో వడ్లు మాయం

రెణివట్ల గ్రామంలో.. రైస్ మిల్లులో వడ్లు మాయం
  • రూ.12.15 కోట్ల విలువ చేసే వడ్లు లేనట్లుగా గుర్తింపు

మద్దూరు, వెలుగు: రైస్​ మిల్లులో సీఎంఆర్  కోసం ఇచ్చిన వడ్లు మాయమయ్యాయి. ఆఫీసర్లు తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది. వీటి విలువ దాదాపు రూ.12.15 కోట్లు ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెణివట్ల గ్రామ శివారులోని రైస్  మిల్లుకు 2022 నుంచి ఇప్పటి వరకు నాలుగు సీజన్లలో 1,74,300 బస్తాల వడ్లను సివిల్  సప్లయ్  ఆఫీసర్లు కేటాయించారు. అయితే వడ్లను పక్కదారి పట్టించారనే సమాచారంతో ఈ నెల 22న అర్ధరాత్రి మిల్లుపై హైదరాబాద్​కు చెందిన టాస్క్ ఫోర్స్  ఆఫీసర్లు, జిల్లాకు చెందిన సివిల్  సప్లయ్  ఆఫీసర్, డీఎంతో కలిసి మిల్లులో తనిఖీలు చేశారు.

 1,74,300 బస్తాలు ఉండాల్సి ఉండగా, 70,362 బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 1,03,654 బస్తాల వడ్లు పక్కదారి పట్టించారని గుర్తించారు. మరుసటి రోజు పంచనామా చేసి రిపోర్ట్​ను జిల్లా అధికారులకు అందజేశారు. ఘటనపై ఆఫీసర్లు మిల్ ఓనర్ ను ప్రశ్నించగా.. వర్షా కాలంలో పెద్ద మొత్తంలో వడ్లు పాడై పోయాయని, షార్టేజ్  మొత్తాన్ని భరిస్తానని ఆఫీసర్ల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. అప్పటికప్పుడే రూ.10 లక్షలు చెల్లించగా, మిగిలిన డబ్బును మూడు రోజుల్లో చెల్లించాలని ఆఫీసర్లు ఆదేశించారు. కాగా, సీఎంఆర్  గడువు ముగియడంతో మిల్లు యజమానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు సిద్ధమైనట్లు సమాచారం.