మౌనమే అన్నింటికంటే సమర్థవంతమైనది, ఎన్నో ఏళ్లుగా దీనిని తెలుసుకోలేకపోయారో దాన్ని కేవలం ఒక్క మౌనం ద్వారానే తెలుసుకోగలం . కానీ, మౌనం నిర్మలంగా నిదానంగా, నిలకడగా ప్రవహిందే జ్ఞాన స్రవంతి! మౌనంగా ఉండేవాళ్లను 'మునులు' అంటారు. ఇక, మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగా, శాంతంగా, భూతహితంగా, మితంగా.. కరుణాన్నితంగా, ఆత్మభావంతో మాట్లాడే వాళ్లే మహామునులు.
మౌనమే మేలు
మౌనంలోని ఆనందాన్ని అనుభవించాలంటే ముందు మాటని నియంత్రించాలి. ఇదొక అపూర్వ కళ, తపస్సు ఎక్కువగా మాట్లాడితే శక్తి తగ్గిపోతుంది. అతిగా మాట్లాడే వాళ్లకు విలువ కూడా తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడాలి. మన మాటలు ఎదుటివాళ్లకి వినసొంపుగా,హితంగా ఉండాలి. అది చేతకాకపోతే మౌనంగా ఉండటమే మేలు' అని విదురనీతి వివరిస్తోంది. మాట వెండి అయితే, మౌనం బంగారం.. అనే సామెత కూడా ఉంది. కఠినంగా మాట్లాడి శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు' అని అంటారు స్వామి వివేకానంద. బలహీనమైన మనసుకి కూడా బలం చేకూర్చగలిగేది మౌనం మాత్రమే.
మౌనంలోనే మునులు
మౌనంగా బోధించడం అనేది ఎన్నో ఏళ్లుగా మన దేశంలో కొనసాగుతున్న బోధన పద్ధతి. గురువు మౌనమే అన్నింటికన్నా గొప్ప ఉపదేశమని, గొప్ప అనుగ్రహం అని చెప్పాడు. గురువు మౌనం... శిష్యుల మనసును శుద్ధి చేస్తుంది. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం, ఇతర గురువులు తమ శిష్యులకు మాటలతో బోధిస్తే దక్షిణామూర్తి' మాత్రం మౌనంగానే ఉండే శిష్యులు సందేహాలు తీరుస్తారు. ఇలాంటి గురువే రమణ మహర్షి .
ఆయన ఎప్పుడూ ఒక గుహలో కూర్చొని..సంపూర్ణ మౌనంలో మునిగేవారు. ఎలాంటి సందేహాలు వచ్చినా, వేదనతో వచ్చినా అతని దగ్గర కూర్చొని వెళ్లేవారు. ఆయన ఏంమాట్లాడేవారు. కాదు. కానీ, వాళ్లకు పరిష్కారం దొరికేది. ఆయన ఎప్పుడోగానీ మాట్లాడేవారు కాదు. మాటలతో చెప్పడం కంటే మౌనంగా చూపు, స్వర్శతోనే ఆయన ఎక్కువగా భోధ చేసేవారు. ఆ గురు శిష్యుల మధ్య మెంటల్ కాంటాక్ట్ ఉండేదన్నమాట 'మౌనమంటే పదాలు ప్రతి బంధాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అంటారు రమణ మహర్షి.
ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే మౌనం. ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం...