‘మన్ కీ బాత్’లో మన ప్రస్తావన

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధాన మంత్రులు ఏటా ఒకటి, రెండుసార్లు ఆయా సందర్భాల్లో ప్రజలకు సందేశాలు ఇవ్వడానికి మాత్రమే ఆకాశవాణి, దూరదర్శన్​ల ద్వారా ప్రసంగాలు చేసేవారు. కానీ, ఒక దశాబ్దంగా రేడియో ద్వారా ప్రతి నెల ఆఖరు ఆదివారం ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ తన భావాలను ‘మనసులోని మాట’ను ‘మన్ కీ బాత్’లో ప్రజలతో పంచుకుంటున్నారు. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ ప్రజా ప్రసంగాల పరంపర ఈ నెల 30 నాటికి నూరవ ఎపిసోడ్ మైలురాయిని చేరుకోనుంది. ప్రజల సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకొని వాటి పరిష్కారాలను సూచిస్తూ వారి విజయగాథలను ప్రోత్సాహపూర్వకంగా ప్రశంసిస్తూ, దేశ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో ప్రజలు ఎలా భాగస్వాములు కావాలో ఉద్భోదిస్తున్న ‘మన్ కీ బాత్’ ఎంతో ప్రత్యేకమైంది. ప్రధాని తన మాటను ప్రజల మాటగా కాకుండా, ప్రజల మాటనే తన మాటగా మలచుకొని ‘‘జన్ కీ బాత్’ నే ‘మన్ కీ బాత్’ గా ఆవిష్కృతం చేస్తున్నారు. 

తిమ్మాయిపల్లిని ప్రశంసించి...

మన్​కీ బాత్​కార్యక్రమంలో భాగంగా ఎందరో తెలుగువారిని గుర్తించి నరేంద్ర మోడీ తన ప్రసంగ పాఠంతో ప్రపంచానికి పరిచయం చేశారు. 2015 అక్టోబర్ 2 నాటి ‘మన్ కీ బాత్’ లో ‘స్వచ్ఛ భారత్’ పై రామోజీరావు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ప్రసార సాధనాల ద్వారా పరిశుభ్రతపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ, సుమారు 51 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొనేలా దోహదపడ్డారని ఆయనను ప్రశంసించారు. 29వ ఎపిసోడ్ లో హైదరాబాద్, వరంగల్​లో ట్విన్ పిట్ మరుగుదొడ్ల మోడల్ ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని, కుళ్లిన వ్యర్థాలను ఉపయోగకరమైన ఎరువుగా మార్చుకోవడంలో పర్యావరణ హితంగా ఇక్కడి ప్రజలు చేస్తున్న కృషిని దేశ ప్రజలకు పరిచయం చేశారు. 2019 జూన్ 30 నాటి ఎపిసోడ్ లో తెలంగాణాలోని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వర్షాకాలంలో ప్రతి నీటిబొట్టును వృథా కానివ్వకుండా వాటిని కాలువలుగా మళ్లించి నీటికుంటలను నిర్మించారు. దీని ద్వారా గ్రామ అవసరాలు తీరుతున్నాయని ‘మన్ కీ బాత్’ లో ప్రధాని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజల దృఢ సంకల్పాన్ని గుర్తు చేశారు.

విశేష కృషికి పద్మశ్రీ

​2021 జనవరి 31 నాటి ‘మన్ కీ బాత్’ లో హైదరాబాద్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో మిగిలిపోయిన కూరగాయలను వృథాగా విసిరివేయకుండా, ప్రతీ రోజు10 టన్నుల వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దాన్ని వ్యర్థాల నుంచి సంపద సృష్టించే యాత్రగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన చింతల వెంకట్ రెడ్డి రైతుగా శాస్త్రీయ పద్ధతిలో పంటలను పండిస్తూ నవ్య ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన విటమిన్ ‘డి’ మిళిత గోధుమ, వరి పంటలను సాగు చేయడాన్ని నరేంద్ర మోడీ 71వ ‘మన్ కీ బాత్’ లో ప్రస్తావించారు. ‘ల్యాబ్ టు ల్యాండ్’ మంత్రంతో తెలంగాణకు చెందిన చింతల వెంకట రెడ్డి వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషి అభినందనీయమని, ఆయను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందని తెలిపారు.

దేశానికి దిక్సూచిగా..

సుదీర్ఘ కాలంగా నరేంద్ర మోడీ చేసిన ‘మన్ కీ బాత్’ ప్రసంగం దేశానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ఇప్పటివరకు సాగిన 99 ఎపిసోడ్ లలో ఎందరో స్వాతంత్ర్యోద్యమ వీరుల త్యాగాలను స్మరించారు. ఎందరో శాస్త్రవేత్తలను, సాహితీమూర్తులను, క్రీడాకారులను, కళాకారులతోపాటు, సామాన్యుల అసామాన్య కృషిని జాతికి పరిచయం చేశారు. సమకాలీన సమాజంలో తెరమరుగున ఉన్న ప్రతిభావంతుల గొప్పతనాన్ని ప్రధాని తన ‘మన్ కీ బాత్’లో పతాకశీర్షికగా నిలిపారు. ఈ ప్రసంగాలు ఎందరికో ప్రేరణ కలిగించాయి. ఈ పరంపరలోనే తెలుగు నేలపై వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి దివిటీ పట్టి జాతికి పరిచయం చేసిన వెలుగు దివ్వె ఈ ‘మన్ కీ బాత్’. అంతేకాదు, ప్రపంచానికి పరిచయం కాని ఎందరో ప్రముఖుల నిశ్శబ్ద ప్రస్థానాలకు శబ్ద సూచిక 
ఈ ‘మన్ కీ బాత్’.

మేడారం తల్లులను తలిచి..

​2022 మార్చి 27 నాటి ‘మన్ కీ బాత్’ లో సికింద్రాబాద్, బన్సీలాల్ పేట ప్రాంతంలోని శతాబ్దాల నాటి మెట్ల బావి గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ కు చెందిన అగ్నికుల్, స్కైరూట్ స్టార్టప్ కంపెనీలు చేస్తున్న అంతరిక్ష పరిశోధనలను నరేంద్ర మోడీ 2022 జూన్ 26 నాటి ‘మన్ కీ బాత్’ ద్వారా వెలుగులోకి తెచ్చారు. పరిశోధనా రంగంలో ఇది ఒక గొప్ప ప్రయత్నమని అభివర్ణించారు. ఈ ప్రసంగంలోనే తెలంగాణకు చెందిన పూర్ణ మలావత్ ధైర్యాన్ని ప్రధాని కొనియాడారు. జులై 31 నాటి ప్రసంగంలో తెలంగాణ మహాకుంభమేళాగా పిలిచే ‘మేడారం జాతర’ గిరిజన సంస్కృతికి, ప్రాచీన చరిత్ర, వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మేడారం గురించి ఆయన ‘మన్ కీ బాత్’ లో మాట్లాడటం జాతరకు మరింత ప్రాచుర్యం తెచ్చింది. ​కాకతీయుల నాటి పేరిణీ నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో వరంగల్ కు  చెందిన రాజ్ కుమార్ చేస్తున్న కృషిని 2023 జనవరి 26 నాటి ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. ఎందరో యువకులను చేరదీసి పేరిణీ నృత్యాన్ని నేర్పిస్తూ, కళారంగ సేవకు అంకితమయ్యారని, ఆయన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బిస్మిల్లా ఖాన్ అవార్డుతో సత్కరించిందని చెప్పారు. 84వ ఎపిసోడ్ లో భువనగిరి, రామన్నపేటకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య సొంత డబ్బుతో 2 లక్షల పుస్తకాలను సమకూర్చి ప్రజల కోసం ఒక గ్రంథాలయాన్ని తీసుకురావడం గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. ఓ మారుమూల ప్రాంతంలో 84 ఏండ్ల వయసులో కూరెళ్ల చేస్తున్న కృషిని ‘మన్ కీ బాత్’ లో పతాక శీర్షికగా ప్రధాని చాటింపు చేయడం తెలుగు ప్రజలకు దక్కిన గొప్ప గుర్తింపు.

పీవీ స్ఫూర్తిని కొనియాడి..

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ భారతదేశంలో తొలుత 2020 జనవరి 27న కేరళలో తొలి కేసుగా నమోదైంది. ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో హైదరాబాద్​లో వైరస్ సోకిన తొలి వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ 2020 మార్చి 29 నాటి ఎపిసోడ్ లో ఆయన అనుభవాలను ‘మన్ కీ బాత్’ ద్వారా తెలుసుకున్నారు. ఉద్యోగరీత్యా దుబాయ్ కు వెళ్లి వచ్చిన క్రమంలో ఈ వైరస్ సోకిందని హైదరాబాద్ లో కరోనా సోకిన తొలి వ్యక్తిని తాను కావడం తనకు ఆందోళన కలిగించిందని, కానీ గాంధీ ఆసుపత్రి డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో వైద్యుల, నర్సుల మానవీయకోణాన్ని ఆయన ద్వారా ప్రధాని తెలుసుకున్నారు. అదే ఏడాది జూన్ 28 నాటి ఎపిసోడ్​లో భారత ప్రధానిగా తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేసిన పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన సేవలను మోడీ స్మరించుకున్నారు. పీవీ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు, ప్రధానిగా దేశ గతిని మార్చడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు.  సామాన్య నేపథ్యం నుంచి ఆయన ఎదిగిన తీరు, నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, రాజీపడని వ్యక్తిత్వం ఈ తరానికి స్ఫూర్తిదాయకమని నరేంద్ర మోడీ అప్పుడు గుర్తు చేశారు.

- డా. జె. విజయ్ కుమార్, ఉద్యోగి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్