
- ఎన్ఈపీపై ఉదయనిధి, అన్నామలై మధ్య వాగ్వాదం
చెన్నై: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్ఈపీ ద్వారా రాష్ట్రంలో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం యత్నిస్తున్నదని డీఎంకే మండిపడింది. దీనికి నిరసనగా గురువారం రాత్రంతా ‘ఎక్స్’ లో ‘గెట్ ఔట్ మోదీ’ అంటూ ప్రచారం చేసింది. దీనికి అన్నామలై కౌంటర్ ఇస్తూ ‘గెట్ ఔట్ స్టాలిన్’ అని ‘ఎక్స్’ లో ప్రచారం చేశారు.
డీఎంకే ప్రభుత్వంపైనా, ఉదయనిధిపైనా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రాన్ని స్టాలిన్ కుటుంబం అహంకారంతో పాలిస్తున్నది. ప్రభుత్వం అవినీతి కేంద్రంగా మారింది. రాష్ట్రాన్ని డ్రగ్స్, అక్రమ మద్యానికి అడ్డాగా మార్చారు” అని ట్వీట్ చేశారు. దీనికి ఉదయనిధి స్పందిస్తూ..‘‘ట్వీట్లు చేయడం కాదు. దమ్ముంటే డీఎంకే ఆఫీసుకు రావాలి” అని సవాల్ విసిరారు. ఒంటరిగానే వస్తానని, ఉదయనిధి కూడా ఒంటరిగానే రావాలని అన్నామలై సవాల్ చేశారు.