పాకిస్థాన్​ నీళ్ల జగడం

కాశ్మీర్​ విషయంలో ఎక్కడా తనకు సపోర్ట్​ రాకపోయేసరికి… పాకిస్థాన్​ కొత్తగా నీళ్ల తగాదాకి దిగింది. దాదాపు 60 ఏళ్ల క్రితం కుదిరిన ఇండస్​ వాటర్​ ఒప్పందాన్ని ఇండియా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా దిగువకు నీళ్లు వదలడం లేదన్నదే పెద్ద వివాదం. చిత్రంగా పాకిస్థాన్​ మాత్రం మాకు చెప్పకుండా నీళ్లు వదుల్తున్నారని గొడవ పెడుతోంది. మన దగ్గరున్నట్లుగా వాటర్​ మేనేజ్​మెంట్​ ఆ దేశంలో లేదు. ఒప్పందం కింద దక్కిన వాటాలో 60 శాతం నీళ్లు వృధాగా అరేబియా సముద్రంలోకి వెళ్తున్నాయి.

ఇన్నాళ్లూ అఫ్ఘానిస్థాన్​ను చూపించి అమెరికా దగ్గర; కాశ్మీర్​ని చూపించి చైనా దగ్గర పబ్బం గడుపుకునేది పాకిస్థాన్. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. జమ్మూ కాశ్మీర్​పై ఐక్య రాజ్య సమితిలోనే దెబ్బ తిన్నది. కాశ్మీర్​ని విడదీయడం మహా నేరం, ఘోరం అంటూ గుండెలు బాదుకున్నా వినేవాళ్లెవరూ కనిపించలేదు. దీంతో 1960 నాటి ఇండస్​ నీళ్ల ఒప్పందాన్ని బయటకు తీసింది. ఈ ఒప్పందాన్ని ఇండియా పాటించట్లేదంటూ ఆరోపణలకు దిగింది. అయితే, ఏ విధంగా ఇండియా పాటించడం లేదో చెప్పడంలో పాక్​ జల వనరుల మంత్రి ఫైసల్​ వావ్దా నీళ్లు నమిలారు. ఇండియా తన రిజర్వాయర్లు నిండితే అదనపు నీళ్లను వదిలేస్తుంది. అవి నేరుగా పాకిస్థాన్​ భూభాగంలోకి వెళ్తాయి.  ‘ఈ విషయాన్ని మాకు ముందుగా చెప్పలేదు కాబట్టి, ఇండస్​ వాటర్​ ఒప్పందాన్ని ఇండియా పాటించనట్లే’ అన్నది పాక్​ మంత్రి వావ్దా వాదన.  ఇదొక చిత్రమైస వాదనగా ఇప్పటికే ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఎక్కడైనా ఎగువన ఉన్న ప్రాంతం తమకు మిగిలిన నీళ్లను దిగువకు వదిలేయడం ఆనవాయితీ. దీనికోసం ప్రత్యేకంగా రివర్​ బోర్డులు, వాటర్​ కమిషన్​ వంటివి పనిచేస్తుంటాయి. ఎప్పటికప్పుడు వర్షాలు, ఎగువ ప్రాంతపు రిజర్వాయర్ల పరిస్థితిని సమీక్షిస్తుంటాయి.

1947లో ఇండిపెండెన్స్​ వచ్చిన రెండు నెలలకే కాశ్మీర్​ని అడ్డం పెట్టుకుని ఇండియా మీదకు పాకిస్థాన్​ కాలు దువ్వింది. అప్పట్లో కోల్డ్​ వార్​ సాగుతున్నందువల్ల అమెరికా మద్దతుగా నిలబడింది. కాలక్రమంలో అమెరికాకి ఆ అవసరం లేకపోయింది.  అయితే, కాశ్మీర్​ నుంచి పాకిస్థాన్​కి వెళ్లే నీళ్ల విషయంలో తరచు తగాదా చోటు చేసుకునేది. పండిట్​ నెహ్రూ హయాంలోనే రెండు దేశాల మధ్య నీళ్ల తగాదా రాకుండా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కరాచీలో కుదిరిన ఈ ఒప్పందంపై  నెహ్రూ, అప్పటి పాక్​ ప్రెసిడెంట్​ ఆయూబ్​ ఖాన్​ సంతకాలు చేశారు.  రెందు దేశాల మధ్య ప్రవహించే ఆరు నదుల్లో మూడింటిపై ఇండియాకి, మరో మూడు నదులపై పాకిస్థాన్​కి కంట్రోల్​ ఉంటుంది.  ప్రధానమైన ఇండస్​ నది పాక్​ కంట్రోల్​లో, సట్లెజ్​ నది ఇండియా కంట్రోల్​లోకి వచ్చాయి. మిగతావాటిల్లో చీనాబ్​, జీలం నదులు పాకిస్థాన్​ పరిధిలో; బియాస్​, రావి నదులు ఇండియా పరిధిలో ఉన్నాయి. ఇండో–పాక్​ దేశాలు తమకు ఒప్పందంద్వారా దక్కిన నీళ్లను వాడుకుని, తమ తమ రిజర్వాయర్లు నిండిన తర్వాత మిగతా నీళ్లను వదిలిపెట్టాలి. జీలం​ నదిపై పాక్​ ఆక్రమిత కాశ్మీర్​లోని మీర్​పూర్​ జిల్లాలో మల్టీపర్పస్​ మంగళ డ్యామ్​, ఇండస్​ నదిపై పాకిస్థాన్​ భూభాగంలోని ఖైబర్​ పఖ్తుంక్వాలో తర్బెలా డ్యామ్​ కట్టుకున్నారు.  ఈ రెండు నదులపైనా, వాటిపై కట్టిన డ్యామ్​లపైనా పాకిస్థాన్​ పెత్తనమే సాగుతోంది. ఈ ఒప్పందం ఇంతకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది.

తాజా వివాదంలో ఇండస్​ వాటర్​ ఒప్పందాన్ని ఇండియా పట్టించుకోవడం లేదన్నది పాక్​ వాదన. ఇది కిషన్​గంగ హైడ్రోఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​కి చెందినది. జమ్మూ కాశ్మీర్​లోని బందిపూర్​ దగ్గర జీలం నది బేసిన్​లోని కిషన్​గంగ (నీలం)  నదిపై దీనిని ఇండియా కట్టుకుంది. దీని కెపాసిటీ 330 మెగావాట్లు. పాక్​ అధీనంలో ఉన్న జీలంపై నేరుగా కట్టకపోయినా, జీలం ఉపనదిపై కట్టినందువల్ల ఈ  ప్రాజెక్టుపై పాక్​ అభ్యంతరాలు చెప్పడం మొదలెట్టింది. ఇదొక్కటే కాకుండా, కిర్తాయ్​–1, 2 ఫేజ్​లు, సావల్​కోట్​, కెరుఎ, బుర్సార్​, గిప్సా ప్రాజెక్టులపైకూడా పాకిస్థాన్​ పదే పదే అభ్యంతరాలు చెబుతోంది. ఒప్పందానికి లోబడి ఇండస్​, చీనాబ్, జీలం నదులపై ఇండియా ఎలాంటి ప్రాజెక్టులూ కట్టడం లేదు. వేసవిలో మంచు కరిగినప్పుడు ఆ ప్రవాహం పూర్తిగా పాక్​లోకి వెళ్లిపోయేలా ట్రీటీలో ఒప్పుకున్నారు. అయితే, ఆ నీళ్లను ఒడిసిపట్టడంలో పాక్​ పూర్తిగా ఫెయిలైంది. దీనితో పాకిస్థాన్​కి దక్కే నీళ్లలో దాదాపు 60 శాతం వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. మన దగ్గర వాటర్​ మేనేజ్​మెంట్​ జరిగినంత పద్ధతిగా పాక్​లో జరగదు. ఆ దేశానికి వాటర్​ రిసోర్సెస్​ పుష్కలంగానే ఉన్నప్పటికీ, వాటిని నిల్వ చేసుకోవడానికి తగిన రిజర్వాయర్లు, డ్యామ్​లు, బ్యారేజ్​లు లేవు. ఆ దేశంలో మొత్తం అన్నీ కలిసి 150 మాత్రమే ఉన్నాయి. అవన్నీకూడా 1960–75 మధ్య కాలంలో కట్టినవే. మన దేశంలో 2012 నాటికే దాదాపు 3300 డ్యామ్​లున్నాయి. మరో మూడొందల పైచిలుకు డ్యామ్​లు వివిధ దశల్లో ఉన్నాయి.

కాగా, ఇండస్​ ఒప్పందం ప్రకారం ఇండియా ఏటా పాక్​ ఇండస్​ వాటర్​ కమిషనర్​కి వరదలు, వర్షాలపై సమాచారం ఇవ్వాలి. ఏటా రెండుసార్లు సమావేశం జరపాలి. ప్రస్తుతం ఏడాదికొకసారే ఈ సమావేశం జరుగుతోంది. మే నెలలో లోక్​సభ ఎన్నికలు జరిగినందువల్ల ఇండస్​ వాటర్​ ఒప్పందం భేటీ జరగలేదు. నిజానికి, రెగ్యులర్​ వరదలపై పరస్పరం సమాచారమిచ్చుకోవాలన్న రూల్​ ఏదీ ఒప్పందంలో లేదని, 1988లో అసాధారణ రీతిలో వరదలు రావడంతో ఈ రూల్​ను చేర్చారని నిపుణులు చెబుతున్నారు. దీని కింద ఇండియా రావి, బియాస్​, సట్లెజ్​​ నదుల్లో వరదలు, భారీ నీటి ప్రవాహం ఉన్నా లేకపోయినా రెగ్యులర్​గా పాకిస్థాన్​కి సమాచారం ఇస్తూనే ఉంది.

వాళ్లు వాడుకోరు..మళ్లించుకుంటే పోలా?

టిట్​ ఫర్​ టాట్​ అనడానికి ఇండియా వాటర్​ ఒప్పందాన్ని వాడుకుంటోంది. ఇప్పటివరకు ఈ ఒప్పందం కింద నీళ్ల మళ్లింపు జరగలేదు. రిజర్వాయర్లు నిండగానే పాకిస్థాన్​కి వదిలేస్తున్నారు. ఇకపైన రావి, బియాస్​, సట్లెజ్ నదుల్లో మిగులు నీళ్ల​ను పంజాబ్​, జమ్మూకాశ్మీర్​ రాష్ట్రాలకు మళ్లించే ప్రాజెక్టు  పనులు మొదలయ్యాయి.

పాకిస్థాన్​ సంగతెలా ఉన్నా, ఇండియా మాత్రం తనకు ఒప్పందం కింద కేటాయించిన నీళ్లను పూర్తిగా వాడుకోవాలనుకుంటోంది. ఈ నిర్ణయం పుల్వామాలో మిలిటెంట్​ దాడి చేసి, 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నప్పుడే తీసుకుంది. ఈ దాడికి పాల్పడ్డ జైష్​–ఏ–మహమ్మద్​ టెర్రర్​ గ్రూప్​ పాక్​ నుంచే పనిచేస్తోంది. తాజాగా, జమ్మూ కాశ్మీర్​ విషయంలో పాక్​ చేస్తున్న హడావుడి చూశాక వేగంగా అమలు చేయాలనుకుంటోంది.  ‘మా ప్రయారిటీల్లో ఇదే ముఖ్యమైంది’ అన్నారు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​. ఒప్పందం కిందకు వచ్చిన నదులకు క్యాచ్​మెంట్​ ఏరియాలో చాలా నీళ్లు వస్తున్నాయి. ఇవన్నీ పాకిస్థాన్​కు పంపిస్తున్నారు. ఇకమీదట ఆ నీళ్లను ఎలా మన భూభాగంలోకి మళ్లించుకోవాలన్నదానిపై కసరత్తు మొదలుపెట్టారు. వర్షాలు పడని సీజన్​లోనూ, వర్షాకాలంలోనూ క్యాచ్​మెంట్​ ఏరియాల నుంచి వచ్చే నీళ్లను వాడుకోవాలన్నది మోడీ సర్కారు ఉద్దేశం.  ప్రస్తుతానికి ఇండియా పరిధిలోగల రిజర్వాయర్లన్నీ నిండగానే మిగులు నీళ్లను పాకిస్థాన్​కి వదిలిపెడుతున్నారు. వీటిని రావి నదిలోకి మళ్లించే కార్యక్రమం మొదలైంది.

పుల్వామాలో దాడి జరగ్గానే… పాకిస్థాన్​కి అన్ని విధాలా బుద్ధి చెప్పాలని మోడీ నిర్ణయించారు. కేవలం సైనిక చర్యకు పరిమితం కాకుండా, వేరే పద్ధతుల్లో అంటే.. వాణిజ్యం, వాటర్​ పంపిణీ, దౌత్య చర్యలతో ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. ఇదివరకే పాక్​కి ఇచ్చిన మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్​ స్టేటస్​ని ఇండియా వెనక్కి తీసుకుంది. అక్కడి నుంచి వచ్చే సరుకులపై 200 శాతం దిగుమతి సుంకం విధించింది. ఐక్యరాజ్య సమితి సహా అన్ని అంతర్జాతీయ వేదికలపైనా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా గట్టిగా మాట్లాడింది. పాక్​ ప్రయత్నాలేవీ ఫలించకుండా అడ్డుకోగలిగింది. ఇప్పడు రావి, బియాస్​ నదుల నుంచి పెద్ద మొత్తంలో వెళ్తున్న నీళ్లను పంజాబ్​, జమ్మూ కాశ్మీర్​ రాష్ట్రాలకు మళ్లించడానికి సన్నాహాలు మొదలెట్టింది.

గతంలో నిలిచిపోయిన షాపూర్​కండి డ్యామ్​లో పనులు ఆరంభించారు. 2014లో పంజాబ్​లోని పఠాన్​కోట్​ జిల్లాలో 2,793 కోట్ల రూపాయలతో దీనిని తలపెట్టారు. సాగుకు, తాగడానికి నీళ్లను ఇవ్వడంతోపాటు 206 మెగావాట్ల కరెంట్​కూడా ఈ డ్యామ్​ద్వారా సాధించవచ్చు, ఈ పనులకు మధ్యలో ఆటంకమేర్పడింది. ఇప్పుడు మోడీ సర్కారు దీనిపై దృష్టి పెట్టింది.