- రెండు ఇంగ్లిష్ మాటలు మాట్లాడ్తే అభివృద్ధి కాదు
- ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు ఉండకపోవచ్చు..!
- పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
వేములవాడ, వెలుగు : ‘కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు మానుకొని..బుద్ధిగా బాధ్యతగల ప్రతిపక్ష లీడర్‌గా పని చెయ్’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ ఇంకా మారడం లేదన్నారు. ఆయన అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు. ‘ఓటమితో కేటీఆర్‌కు మైండ్ పనిచేయడం లేదు. అందుకే మా ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం..బీఆర్ఎస్ విధ్వంస రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు..కేటీఆర్ ప్రతిపక్ష లీడర్ హోదాలో బుద్ధిగా పని చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు.. లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారు.. ఎక్కడో ఓ దేశంలో బతికి రెండు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వచ్చి మాట్లాడితే అభివృద్ధి కాదు.. మీ ఇంగ్లీష్‌కి, అభివృద్ధికి ఏమిటి సంబంధం?’ అని మంత్రి నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ గురు వారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీతక్క మాట్లాడుతూ తొమ్మిదేండ్లు రాష్ట్రంలో గడీల పాలన కొనసాగిందని, ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నేతల తీరులో మార్పు రావడం లేదన్నారు. ఇప్పటికీ కేసీఆర్ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదని గుర్తుచేశారు. మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన తెలంగాణలోని రాజన్న ఆలయం, సమ్మక్క - సారక్క జాతర, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. త్వరలోనే ఆది శ్రీనివాస్అధ్యక్షతన సీఎం అధ్వర్యంలో రాజన్న టెంపుల్అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి
అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు ఉండకపోవచ్చు..
ఇప్పట్లో సర్పంచ్ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, దీనిపై రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. సర్పంచుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నిధుల లభ్యతను బట్టి వాళ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామన్నారు. ప్రతి నెలా 5వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేల విజయంపై కేటీఆర్ చులకనగా మాట్లాడారని, ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ‘బీసీ, ఎస్సీలు ఎమ్మెల్యేలుగా గెలవకూడదా? ఎప్పటికీ మీ దొరలే ఎమ్మెల్యేలుగా ఉండాలా?’ అని ప్రశ్నించారు. అంతకుముందు మంత్రికి సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ పూల మొక్కలు బహూకరించి స్వాగతం పలికారు.