పని మంచిదే.. మరి పద్ధతి ఇదేనా?

గాంధేయ తాత్విక దృక్పథం ప్రబలంగా ఉండిన జాతీయోద్యమ రోజుల్లో గమ్యం- మార్గం, లక్ష్యం -సాధనం అనే చర్చ జరుగుతుండేది. గమ్యం మంచిదైతే ఏ మార్గం అనుసరించి చేసినా పరవా లేదని, మంచి లక్ష్యం సాధించడానికి ఏ సాధనమైనా వినియోగించవచ్చునని సాధారణంగా ఉండే ఆలోచనను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంచి గమ్యానికి మార్గం కూడా మంచిదే కావాలని, తప్పుడు సాధనాలు ఉపయోగిస్తే లక్ష్యానికి కూడా హాని జరుగుతుందని గాంధీ అన్నారు. కానీ సమాజం ఇప్పుడు ఆ గాంధేయ నైతిక దృక్పథం నుంచి చాలా దూరం వచ్చినట్టుంది. ఇటీవల ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ రంగాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే పైకి చూడడానికి మంచి పనులుగా అనిపించిన వాటిని కూడా చాలా తప్పుడు పద్ధతిలో అమలు చేస్తున్నారని, ఈ వ్యాధి పైనుంచి కింది దాకా వ్యాపించిందని కనబడుతోంది. ఇటీవలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను మరో కోణం నుంచి చూసినప్పుడు ఈ నైతిక దృక్పథ లేమి కొట్టొచ్చినట్టు కనబడుతున్నది.

రెండు చట్టాల కింద

దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టడం తప్పనిసరిగా జరగాల్సిన మంచి పని. కొనుగోళ్లలో, అమ్మకాలలో తప్పుడు లెక్కలు చెప్పి పన్ను ఎగవేత, అక్రమ మార్గాల సంపాదన, అవినీతి, ఆదాయ వనరులకు మించి సంపద పోగుపడటం, ప్రభుత్వ కాంట్రాక్టులలో అక్రమాలు, విదేశీ మారకద్రవ్యం హవాలా వ్యాపారం, అక్రమ ధనాన్ని సక్రమ ధనంగా మార్చడం వంటి ఆర్థిక నేరాలు ఎన్నో దశాబ్దాలుగా మన సమాజంలో సాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రభుత్వాధికారులు వంటి ఎన్నో వర్గాలు అటువంటి ఆర్థిక అక్రమాలకు అడ్రస్​గా ఉంటున్నారు. ఆర్థిక నేరాల్లో ప్రధాన భాగమైన ఆదాయ పన్ను ఎగవేత వ్యవహారాలను ఆదాయ పన్నుల శాఖ పర్యవేక్షిస్తుండగా, ప్రత్యేకమైన ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయడానికి, ఎప్పటికప్పుడు ఆర్థిక సమాచారం సేకరిస్తూ, ఎక్కడ చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు జరిగినా దాడులు, సోదాలు చేసి, నేరస్తులను పట్టుకుని, బోనెక్కించి, విచారణ జరిపి, శిక్ష విధించడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని, రెవెన్యూ విభాగంలో 1956లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనే నిర్మాణం ఏర్పాటైంది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్​మెంట్ యాక్ట్(ఫెమా) 1999, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఎ) 2002ల కింద జరిగే నేరాలతో వ్యవహరించడం ఈడీ పని. 

దాడులు మంచివే కానీ..

ఇటీవలి కాలంలో, ముఖ్యంగా 2014లో బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈడీ దాడులు విపరీతంగా పెరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చట్టాల కింద ఆర్థిక నేరాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నది. ఇటువంటి దాడుల అవసరం ఎక్కువగానే ఉన్నది. గత ఎనిమిదేండ్లలో హఠాత్తుగా ఈ నేరాల సంఖ్య ఏమీ పెరగలేదు. దాడుల సంఖ్య మాత్రం పెరిగింది. రెండు వారాల కింద రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఈ దాడులకు సంబంధించిన గణాంకాలు ప్రకటించారు. 2004–-2014 మధ్య పదేండ్లలో పీఎంఎల్ఎ కింద మొత్తం112 దాడులు, సోదాలు జరిగాయని, 2014–-22 మధ్య ఎనిమిదేండ్లలో3,010 దాడులు, సోదాలు జరిపి, 992 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆ 992 కేసుల్లో కేవలం 23 మంది మాత్రమే నేరస్తులుగా రుజువుకాగా, వారికి శిక్షలు పడ్డాయి. ఫెమా కింద 2004-–14 మధ్య  571 సోదాలు, 8,586 కేసులు నమోదు కాగా, 2014–-22 మధ్య 996 సోదాలు జరిగి, 22,330 కేసులు నమోదు అయినట్లు ఆయన చెప్పారు. ఈ గణాంకాలన్నీ చూస్తే, దేశంలో అక్రమ సంపదను అరికట్టడం గురించి, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంపై ప్రస్తుత ప్రభుత్వం చాలా తీవ్రంగా ఉన్నట్టు, ఆర్థిక నేరస్తుల మీద దాడి చేసి కేసులు నమోదు చేయడం అనే చాలా మంచి పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ దాడులకు గురైనవారు, కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజంగానే ఆర్థిక నేరస్తులే కావచ్చు కూడా. కానీ ఈ వాస్తవానికి అవతలి ముఖాన్ని చూస్తే, ఈ దాడులకు, సోదాలకు, కేసులకు గురైనవారు దాదాపు మొత్తానికి మొత్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలకు సహకరిస్తారనే అభిప్రాయం ఉన్న వ్యాపారస్తులు మాత్రమే. దాడులు జరపడానికి అర్హత ఉన్న మూడు వేల మందిలో అధికారపక్ష రాజకీయ నాయకులు, దానికి దగ్గరగా ఉండే వ్యాపారులు ఒక్కరు కూడా లేకపోవడం వింతల్లోకెల్లా వింత. 

ప్రతిపక్ష నాయకులపైనే..

నిజానికి ఇయ్యాల దేశంలో జరుగుతున్న ఆర్థిక నేరాల్లో అన్ని రాజకీయపక్షాలకూ చెందిన ఛోటా మోటా రాజకీయ నాయకుల నుంచి అత్యున్నత రాజకీయ పీఠాలను అధిరోహించిన వారివరకు అందరికీ సంబంధం ఉంది. మరి ఎంపిక చేసి కొన్ని రాజకీయ పక్షాల నాయకుల మీదనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నట్టు? ప్రతిపక్షాలకు నిలువ నీడ లేకుండా చేయడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను బలహీన పరచడం, విపక్ష ప్రజా ప్రతినిధులను తమ పక్షం వైపునకు లాక్కోవడానికి బెదిరించడం అనే వాస్తవ లక్ష్యాలే ఈడీ దాడుల వెనుక ఉన్నాయని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమమవుతుంది. ఇటీవలి కాలంలో దాడులకు గురైన రాజకీయ నాయకుల పేర్లు అందరికీ తెలిసినవే. మొదట నోటీసులకు, సోదాలకు గురైనప్పుడు ఆర్థిక నేరస్తులుగా కనబడిన ప్రతిపక్ష నాయకులే, రాత్రికి రాత్రి అధికార పక్షంలోకి మారిపోయి, అమాయకులుగా గుర్తింపు పొందుతున్నారు. ఈడీ వారిని వదిలేస్తున్నది. అంటే అందరూ ఆర్థిక నేరస్తులే గానీ ప్రస్తుతం ఈడీ గురి పెట్టదలచిన ఆర్థిక నేరస్తులు అధికారపక్షానికి గిట్టనివాళ్లు మాత్రమేనన్నమాట. తమ పక్షంలో ఉన్నవారు, తమ పక్షంలోకి రాదలచుకున్నవారు ఆర్థిక నేరస్తులు కాకుండా పోతారన్నమాట. 

తెలంగాణలోనూ అలాంటిదే..

అవసరమైన మంచి పనుల పేరు చెప్పి తప్పుడు పద్ధతులకు పాల్పడటం కేవలం కేంద్ర ప్రభుత్వానికో, ఏదో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన వ్యవహారం కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుసరిస్తున్న ఇటువంటి వ్యూహాన్నే విభిన్న రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు కూడా అనుసరిస్తున్నాయి. తెలంగాణ ఉదాహరణే తీసుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే కోటి ఎకరాలకు సాగు నీరు ఇస్తామనే ఒక మంచి పనిని ప్రకటించింది. తెలంగాణ సమాజంలో ప్రధాన ఆకాంక్షగా ఉండిన సాగునీళ్ల సమస్యను సెంటిమెంటుగా మార్చిన అధికారపక్షం, ఆ మంచి పని చేయడం పేరుతో ఏమైనా చేయవచ్చునని, ఆ మంచి పనిని కూడా పద్ధతి లేకుండా చేయవచ్చునని కనిపెట్టింది. అంతకు ముందరి ప్రభుత్వమే రూపకల్పన చేసిన ఒక పథకాన్ని రిడిజైన్ చేస్తున్నానని, చిన్న చిన్న మార్పులు చేసి, పేరు మార్చి రాత్రికి రాత్రి అంచనా వ్యయాన్ని రూ.38,000 కోట్ల నుంచి రు. 80,000 కోట్లకు పెంచేసింది. ఆ అంచనా వ్యయం ఇప్పుడు ఏడేండ్ల తర్వాత చూస్తే ఒక లక్షా నలబై వేల కోట్ల రూపాయల దగ్గర ఉంది. ఇందులో వాస్తవమైన ఖర్చు ఎంతో, కాంట్రాక్టర్లకు దక్కేదెంతో, రాజకీయ నాయకత్వానికి దక్కే ముడుపులెన్నో ఎవరికి వారు అంచనా కట్టుకోవాల్సిందే. అంటే, మొత్తం మీద తెలంగాణ సమాజమంతా ఆకాంక్షించిన, ఒక అవసరమైన మంచి పనిని కూడా ఎంత తప్పుడు పద్ధతిలో చేయవచ్చునో ఆ పథకం ద్వారా ఉదాహరణ ప్రాయంగా చూపుతున్నది ప్రభుత్వం. కాబట్టి ఏ పనినైనా దాని మంచి చెడులను చూసి మాత్రమే కాదు, అది అమలవుతున్న పద్ధతి కూడా చూసి మదింపు వేయాలి. 

- ఎన్ వేణుగోపాల్, 
ఎడిటర్, వీక్షణం