జీహెచ్ఎంసీలో పనులు ముందుకు సాగుతలేవ్..

జీహెచ్ఎంసీలో పనులు ముందుకు సాగుతలేవ్..
  • జార్ఖండ్ ఎన్నికల డ్యూటీలో కమిషనర్ ఇలంబర్తి
  • సమగ్ర సర్వే బిజీలో బల్దియా ఉన్నతాధికారులు
  • సర్కిల్, జోనల్ స్థాయిలో ఎక్కడి పనులు అక్కడ్నే.. స్తంభించిన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ 
  • నిలిచిపోయిన ఆఫీసర్ల ప్రమోషన్లు
  • బదిలీపై వచ్చిన ఆఫీసర్లకు చాంబర్ల అలాట్​ పెండింగ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పాలన ముందుకు సాగడం లేదు. కమిషనర్ ఇలంబర్తి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్​గా వెళ్లి 20 రోజులు కావస్తోంది. ఇదే టైంలో గ్రేటర్​వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే షురువైంది. బల్దియాలోని ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది దానిపైనే ఫోకస్​పెట్టారు. ఉన్నతాధికారులు అందుబాటులో ఉండకపోవడంతో సర్కిల్, జోనల్​స్థాయిలో పనులు జరగడం లేదు. కమిషనర్ లేకపోవడంతో ఇటీవల బదిలీ అయిన ఆఫీసర్లు రిలీవ్ కాలేదు. ఇక్కడికి ట్రాన్స్​ఫర్​పై వచ్చిన వారికి ఛాంబర్లు కేటాయించలేదు. దీంతో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ గా వచ్చిన ఐఏఎస్​ఆఫీసర్​సుభద్రదేవికి ఇంతవరకు చాంబర్ కేటాయించలేదు.

ఫైల్స్​  పెండింగ్.. శానిటేషన్​ నిల్​

కమిషనర్ లేకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆలస్యమవుతున్నాయి. పనులకు సంబంధించి జోనల్ కమిషనర్ల నుంచి మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ కి ఫైల్స్ వస్తాయి. సీఈ పరిశీలించిన తర్వాత వాటికి కమిషనర్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అవి పెండింగ్​పడుతున్నాయి. వీటితోపాటు నాలాల పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కనిపిస్తోంది. కమిషనర్​ఇలంబర్తి ఉన్నప్పుడు రోజూ ఉదయం ఫీల్డ్ విజిట్ చేసి శానిటేషన్ తీరును పరిశీలించేవారు. పర్యవేక్షణ లేకపోవడంతో శానిటేషన్ అస్తవ్యస్తంగా తయారైంది. స్వీపింగ్ మెషీన్లు పెద్దగా రోడ్లపై తిరగడం లేదు.

అధికారులు ఉండట్లే..

మెజారిటీ ఆఫీసర్లు సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడొస్తున్నారో.. ఎప్పుడు వెళుతున్నారో తెలియడంలేదు. అడిషనల్ కమిషనర్ల నుంచి మొదలుపెడితే సర్కిల్ స్థాయిలో పనిచేసే వారికి వరకు సక్రమంగా పనులు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 12 రోజుల కింద సర్వే ప్రారంభం కాగా, వారం కింద కొంతమంది అధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికారులు సర్వే పేరు చెబుతూ అందుబాటులో ఉండటంలేదు. కొందరు మధ్యాహ్నం వరకు ఆఫీసులకు వచ్చి ఆ తర్వాత సర్వేకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా పరిశీలించి అలా వెళ్లిపోతున్నారు. అధికారులు ఫీల్డ్ లో ఉంటే రోజూ దాదాపు 2లక్షల కుటుంబాల సర్వే జరగాలి. కానీ లక్షన్నర కూడా జరగడం లేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

తగ్గిన ట్యాక్స్ కలెక్షన్

బల్దియా సిబ్బందిని మొత్తం కుటుంబ సర్వే కోసం వినియోగిస్తుండటంతో ఆ ప్రభావం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​పై పడింది. గతేడాది ఇదే నెలలో రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ రాగా, ఈ నెలలో మరో 10 రోజులుమిగిలి ఉండగా, కేవలం రూ.12 కోట్లు మాత్రమే వచ్చింది. ట్యాక్స్​విభాగంలోని 343 మంది బిల్ కలెక్టర్లు, 140 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు సర్వే డ్యూటీలోనే ఉన్నారు. బల్దియా ట్యాక్స్ లపైనే ఎక్కువగా ఆధారపడింది. ప్రస్తుతం జీతాలు, పెన్షన్లు  వేయాలంటే దాదాపు రూ.150 కోట్లు అవసరం. మొన్నటి వరకు ఒకటో తేదీన జీతాలు అందించిన బల్దియాకు వచ్చేనెలలో జీతాలివ్వడం కష్టం కానుంది.

కమిషనర్​ రాక కోసం వెయిటింగ్

బల్దియాలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ల వరకు పదోన్నతులు నిలిచిపోయాయి. ఆమ్రపాలి ఉన్న టైంలో పదోన్నతుల ఫైల్ రెడీ అయ్యింది. అంతలోపే ఆమె ఏపీకి వెళ్లడంతో ఇలంబర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆయన ఎన్నికల డ్యూటీకి వెళ్లారు. వారం కింద ప్రభుత్వం ఇలంబర్తిని పూర్తిస్థాయి కమిషనర్ గా నియమించింది. ఆయన ఇంకా జార్ఖండ్​లోనే ఉండడంతో ప్రమోషన్స్ అంశం పెండింగ్ లోనే ఉంది. చాలా ఫైల్స్ కమిషనర్ రాక కోసం వెయిట్ చేస్తున్నాయి.