నత్తనడకన..ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు

  •     స్లోగా కొనసాగుతున్న పనులు 
  •     వ్యాపారుల అవస్థలను పట్టించుకోవట్లె

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు స్లోగా కొనసాగుతున్నాయి. కలెక్టర్​ పలుమార్లు హెచ్చరించినా పనుల్లో స్పీడ్ పెరగలేదు.  కొత్తగూడెంలో మార్కెట్​ నిర్మాణంలో భాగంగా అక్కడి చిరు వ్యాపారులను ఇతర ప్రాంతాలకు తరలించినా అక్కడ కనీసం వసతులు కల్పించక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. 

నత్తనడకన పనులు..

జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలలో ప్రభుత్వం ఇంటి గ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో మున్సిపాలిటీలో దాదాపు రూ. 4.50కోట్లతో నాలుగు చోట్ల  రూ.18 కోట్లతో నిర్మించే వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్ల నిర్మాణాలకు గతేడాది మార్చిలో ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. అప్పటినుంచి పనులు స్లోగా జరుగుతుండడంపై  పలుమార్లు పబ్లిక్​హెల్త్ ఆఫీసర్లపై గత కలెక్టర్ అనుదీప్​ మండిపడ్డారు.

ఆఫీసర్లకు షోకాజ్​ నోటీస్ లు ఇవ్వాలని ఆదేశించారు. పనులు స్పీడ్​గా చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్​ లిస్ట్​లో పెడ్తామని హెచ్చరించారు. ప్రస్తుత కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఇంజినీరింగ్​ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లలోనూ డెవలప్ మెంట్​ వర్క్స్  స్లోగా నడుస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డిసెంబర్​ నాటికి..

జిల్లాలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల నిర్మాణాలు ఈ డిసెంబర్​ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కాగా ఇల్లెందులో సగం పనులు కూడా కాలేదు. కొత్తగూడెంలో మార్కెట్​ పిల్లర్ల దశలోనే ఉంది.  మార్కెట్ నిర్మాణంలో భాగంగా కొత్తగూడెంలోని చిరు వ్యాపారులను ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. వారికి ఎటువంటి సౌకర్యాలను మున్సిపల్​ఆఫీసర్లు కల్పించకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. టెంట్లు వేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. వర్షం వస్తే ఆ ప్రాంతమంతా  చిత్తడిగా మారుతుండడంతో వ్యాపారులతో పాటు వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు.  

చేపల వ్యాపారులు రోడ్డు పక్కన చేపలను అమ్ముకుంటున్నారు. పనుల నాణ్యత విషయంలోనూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిమెంట్, కంకర, ఇసుక, వాటర్​ మిక్సింగ్​లో తేడాలున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వెజ్, నాన్​వెజ్​మార్కెట్ల నిర్మాణాలు స్పీడ్​గా అయ్యేలా కలెక్టర్​ చర్యలు చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.

స్పీడ్​గా చేపడ్తున్నాం.. 

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో రూ. 18 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల నిర్మా ణాలు సాగుతున్నాయి. పాల్వంచ. మణు గూరు మున్సిపాలిటీల్లో  నిర్మాణా లు డిసెంబర్​ నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఇల్లెందులో ల్యాండ్​ ఆలస్యం గా అప్పగించడంతో కొంత ఇబ్బంది కలి గింది. కొత్తగూడెంలో పనులను స్పీడ్​గా చేపడ్తున్నాం. నాణ్యత విషయంలో రాజీ పడం.

- శ్రీనివాసరావు​, డీఈ, పబ్లిక్​ హెల్త్​