- శ్రీరామనవమి రోజు వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్
- ఏర్పాట్లు చేస్తున్న ఎన్‌హెచ్ ఇంజినీర్లు
భద్రాచలం, వెలుగు : తొమ్మిదేండ్ల తర్వాత భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జి పనులు పూర్తి దశకు వచ్చాయి. అప్రోచ్‌రోడ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17న శ్రీరామనవమి రోజు వంతెన పై నుంచి వాహనాలను పంపించేందుకు జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో నేషనల్ హైవే ఇంజినీర్లు సన్నాహాలు చేస్తున్నారు.
2015 ఏప్రిల్ 1న శంకుస్థాపన సమయంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. తర్వాత కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోకపోవడంతో పనులు స్లోగా జరిగాయి. కాంట్రాక్టరు పనులు చేయకుండా మొండికేశారు. 2023 డిసెంబరు నాటికి బ్రిడ్జిపై భీమ్‌లు పూర్తి చేసినా మిగతా పనులు ఆపేశారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చి జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరారవు వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కలెక్టర్ ప్రియాంక అలతో కలిసి పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్, ఎన్‌హెచ్ ఇంజినీర్లతో బ్రిడ్జి వద్దే సమీక్ష నిర్వహించారు. ఆలస్యంపై నిలదీశారు. శ్రీరామనవమి నాటికల్లా అప్రోచ్ రోడ్లు పూర్తిచేసి, వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో కలెక్టర్ ప్రతీ రోజూ రివ్యూ చేస్తూ అవసరమైన మెటీరియల్వచ్చేలా చూస్తూ పనులు పూర్తి చేయించారు. ఎట్టకేలకు శ్రీరామనవమికి రెండో వంతెనపై వాహనాల రాకపోకలకు క్లియరెన్స్ వచ్చింది.
అవాంతరాలు దాటి!
తొమ్మిదేండ్ల కింద భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన నిర్మాణానికి రూ.100కోట్లు మంజూరు చేశారు. ముంబైకి చెందిన రాజ్‌దీప్ ఇంజినీరింగ్ కంపెనీ రూ.65కోట్లతో నిర్మాణానికి టెండర్లు పొందింది. 36 పిల్లర్లు నిర్మించే సమయంలో నాణ్యతా లోపం వల్ల మూడు పిల్లర్లు పక్కకు వంగాయి. కెమికల్ ట్రీట్మెంట్తో వాటిని సరిచేశారు. టెండర్లు పొందిన సంస్థ పెరిగిన సిమెంట్, ఐరన్ ధరలతో నిర్మాణ వ్యయం పెరిగి అర్ధాంతరంగా పనులు నిలిపేసింది.
ఎన్‌హెచ్ ఇంజినీర్లు పనులఅలసత్వంపై కాంట్రాక్టు సంస్థకు నాలుగు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. 10శాతం పెనాల్టీ విధించి రూ.6.50కోట్లు వసూలు చేశారు. పిల్లర్లు పూర్తి చేసి వాటిపై భీమ్ గెడ్డెర్లు పెట్టేందుకు తరలిస్తున్న క్రమంలో భద్రాచలంలో 90 టన్నుల గెడ్డెర్ కిందకు జారిపడి పగిలిపోయింది. ఇక పనులు పూర్తయ్యేనా? అనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఒకానొక దశలో పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెడతామంటూ హెచ్చరించడంతో సంస్థ ముందుకొచ్చింది. కానీ కూలీలకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు సమ్మెకు దిగారు. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు కూర్చుని ఆ సమస్యను పరిష్కరించి పనులు మొదలుపెట్టి ఇప్పటికి పూర్తి చేశారు.
పెండింగ్‌లో రెయిలింగ్, ఫుట్‌పాత్ పనులు
బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినా రెయిలింగ్, ఫుట్‌పాత్, రివిట్మెంట్ పనులు పెండింగ్ ఉన్నాయి. భద్రాచలం, సారపాక వైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కానీ వాటికి ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా 12 మీటర్ల వెడల్పుతో 5అడుగుల ఫుట్‌పాత్‌ను కూడా కట్టాలి. బ్రిడ్జికి రెండు వైపులా గోదావరి ఒడ్డుకు రివిట్మెంట్ చేయాల్సి ఉంది. శ్రీరామనవమి రోజు వాహనాల రాకపోకలను ప్రారంభించినా.. తర్వాత మళ్లీ మూసివేయనున్నారు. రెయిలింగ్, ఫుట్ పాత్, రివిట్ మెంట్పనులు పూర్తి చేసి, ఎన్నికలు ముగిసిన వెంటనే అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.
శ్రీరామనవమికి సిద్ధం చేస్తున్నాం
శ్రీరామనవమి రోజు భక్తుల వాహనాల రాకపోకలకు భద్రాచలం వద్ద రెండో వంతెనను సిద్ధం చేస్తున్నాం. అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. శ్రీరామనవమి తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం.
– యుగంధర్, ఈఈ, నేషనల్
హైవేస్, భద్రాద్రికొత్తగూడెం