- అంచనా వ్యయం పెరుగుతున్నా పనులు మాత్రం అయితలే
- రోడ్ల పైనే వెజ్, నాన్ వెజ్ అమ్మకాలు
- పట్టించుకోని అధికారులు
జనగామ, వెలుగు: జనగామ లో మోడల్ మార్కెట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ మాంసం, కూరగాయల అమ్మకాలు బంద్ చేసేందుకు ఈమోడల్ మార్కెట్‌ను మొదలు పెట్టారు. పైగా సిద్దిపేటలోని మోడల్ మార్కెట్ కన్నా అద్భుతంగా దీన్ని కడతామని లీడర్లు చెప్పారు. ప్లాన్లు, డిజైన్లు మార్చి బడ్జెట్‌ను కూడా డబుల్ చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పట్టింపు కరువైంది. పునాది వేసి నాలుగేండ్లయినా మోడల్ మార్కెట్ఇంకా గోడలకే పరిమితమైంది.
నాలుగేండ్ల కిందట పునాది
జనగామ జిల్లా కేంద్రంగా మారడంతో జనాల రద్దీ పెరిపోయింది. టౌన్ జనాభా సుమారు లక్ష దాటినట్లు అంచనా. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో నాలుగేండ్ల క్రితం టౌన్ లోని దయానిలయం సమీపంలో మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యారు. టీయూఎఫ్ఐడీసీ కింద ఈ నిధులు మంజూరు కాగా ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. పనులు వెంటనే పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
అంచనాలు డబుల్
మోడల్ మార్కెట్ నిర్మాణానికి తొలుత రూ. 2 కోట్లు మంజూరు చేశారు. సిద్దిపేట మార్కెట్‌ను తలదన్నేలా రూపుదిద్దుకోనున్నట్లు చెప్పారు. కానీ ఈ నిధులు సరిపోవట్లేదని అదనంగా రూ. 2కోట్లు మంజూరు చేశారు. ముందు అనుకున్న డిజైన్ కాకుండా పలుమార్లు మార్పులు కూడా చేశారు. దీంతో కొత్త డిజైన్‌కు అంచనాలు కూడా పెరిగాయి. పలు మార్లు కౌన్సిల్ మీటింగ్ లలో మోడల్ మార్కెట్ గురించి ప్రతిపక్షాల లీడర్లు ప్రశ్నించినా.. . పట్టింపు లేకుండా పోయింది. ఈ మార్కెట్ లో వెజ్ 43, నాన్ వెజ్ 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల చివరికల్ల పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే దీని పక్కనే రూ రెండు కోట్లతో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం పూర్తైతే జనగామకు సరికొత్త కళ రానుండగా పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు తప్పడం లేదు.
రోడ్ల పైనే అమ్మకాలు
మోడల్ మార్కెట్ నిర్మాణం లేట్ అవుతుండటంతో రోడ్ల పైనే కూరగాయలు, మాంసం అ మ్ముతున్నారు. బస్టాండ్ ఏరియా, సిరాజ్ ఫ్రూట్స్ ఏరియా, రైల్వే స్టేషన్ పరిసరాలు, సిద్ధిపేట రోడ్డు, ఇలా పలు చోట్ల రోడ్ల పై అమ్మకాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ కు కూడా అంతరాయం కలుగుతోంది.
నెలాఖరు వరకు పూర్తి చేయిస్తం
జనగామ మోడల్ మార్కెట్ పనులు దాదాపు పూర్తి కావచ్చినయ్. రూ నాలుగున్నర కోట్లతో పనులు జరుగుతున్నయ్. వెజ్, నాన్ వెజ్ స్టాళ్ల ఏర్పాటు పనులు చేస్తున్నరు. ఈ నెలాఖరుకు పూర్తి చేసి ఓపెన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కు త్వరగా పూర్తి చేయాలని చెప్పాం. కొద్ది రోజుల్లోనే మార్కెట్ ను అందుబాటులోకి తీసుకు వస్తం.
- జంపాల రజిత, మున్సిపల్ కమిషనర్, జనగామ
పట్టించుకుంటలేరు
మోడల్ మార్కెట్ పనులను స్పీడప్ చేయాలని ఎన్ని మార్లు కోరినా పట్టించుకుంట లేరు. ఏండ్ల తరబడి పనులు చేస్తున్నరు. మొదట్లో రెండు కోట్లన్నరు. ఇప్పుడు డబుల్ చేసిండ్రట. అయినా పనులు అయితలేవు. మార్కెట్ పూర్తి అయితే జనగామ జనాలకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికైనా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి.
- జక్కుల అనిత, కౌన్సిలర్, జనగామ