రైల్వే శాఖ ఆధ్వర్యంలో మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ లో భాగంగా సిద్దిపేటలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కొద్ది రోజుల్లో సాకారం కాబోతున్నది. మరో 15 రోజుల్లో సిద్దిపేట వాసులు రైలు కూతను విననున్నారు. కొండపాక మండలం దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు దాదాపుగా పనులు పూర్తవడంతో శుక్రవారం సేఫ్టీ కమిషనింగ్ ఇన్స్ పెక్షన్ టెస్ట్ నిర్వహించనున్నారు. ట్రాక్ లో సేఫ్టీ పాయింట్లతో పాటు ట్రాక్ పారామీటర్లను రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలిస్తారు.
అనంతరం దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు 12 కిలోమీటర్ల మేర ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ట్రయల్ రన్ లో ఏమన్నా లోటుపాట్లుంటే వాటిని సరిదిద్దిన తరువాత స్టేషన్ ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేయనున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో 151.36 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్ తొలి దశలో భాగంగా సిద్దిపేట రైల్వే స్టేషన్ ను సిద్దం చేస్తున్నారు. దుద్దేడ నుంచి సిద్దిపేట వరకు ఉన్న 12 కిలోమీటర్ల మేర పనులు పూర్తవడంతో ట్రాక్ లను టెస్ట్ చేయనున్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభం కాగానే రెండో దశలో సిద్దిపేట– సిరిసిల్ల మధ్య రైల్వే పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు.
రూ.ఆరు కోట్ల వ్యయంతో స్టేషన్
దాదాపు రూ.ఆరు కోట్ల వ్యయంతో సిద్దిపేట రైల్వే స్టేషన్ ను జీ ప్లస్ వన్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. స్టేషన్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ర్యాంప్, మెట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రయాణికులు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ ఎలివేషన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్టేషన్ ఫ్లాట్ ఫాం పనులు పూర్తయ్యాయి. టికెట్ కౌంటర్, కార్యాలయాల ఏర్పాటుతో పాటు ఫ్లోరింగ్ పనులు కూడా చివరి దశకు చేరాయి.
ప్యాసింజర్ ట్రైన్లతో స్టేషన్ ప్రారంభం
ప్యాసింజర్ ట్రైన్లతో సిద్దిపేట రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి తిరుపతి, బెంగుళూరుకు ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు. అలాగే సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు రోజూ ఫుష్ ఫుల్ ట్రైన్ ను నడిపేందుకూ కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి హరీశ్ రావు ఎంపీ కొత్త ప్రభాకర రెడ్డితో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో ఇటీవలే సమావేశమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గించి ప్రత్యామ్నాయంగా సిద్దిపేట రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్ రైల్వే స్టేషన్ ను సరకు రవాణా కేంద్రంగా తీర్చిదిద్దగా సిద్దిపేట రైల్వే స్టేషన్ ను ప్యాసింజర్ ట్రైన్ల స్టార్టింగ్ పాయింట్ గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట నుంచి కొన్ని ప్యాసింజర్ ట్రైన్లను ప్రారంభిస్తే సికింద్రాబాద్ స్టేషన్ పై ఒత్తిడి తగ్గడంతో పాటు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి, బెంగుళూరుకు ప్యాసింజర్ ట్రైన్లను ప్రారంభించినా భవిష్యత్తులో ఢిల్లీ, ముంబై, చెన్నై, షిర్డీకి కూడా ఇక్కడి నుంచే ట్రెయిన్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రైల్వే ఇంజినీర్ జనార్దన్ తెలిపారు.
స్టేషన్ లో మూడు ట్రాక్ లు రెడీ
సిద్దిపేట రైల్వే స్టేషన్ లో ఐదు రైల్వే ట్రాక్ లను ఏర్పాటు చేస్తుండగా వాటిలో మూడు ట్రాక్ పనులు పూర్తయి టెస్టింగ్ కు రెడీగా ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ల కోసం ఉద్దేశించిన ట్రాక్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మెయిన్ ట్రాక్ లోని మూడు లైన్ల పనులు పూర్తిచేసిరైల్వే సేఫ్టీ కమిషనింగ్ కోసం సిద్ధం చేశారు. మొదటి మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, నాలుగో లైనులో గూడ్స్ ట్రెయిన్, ఐదో లైనులో ప్యాకింగ్, మరమ్మతులు ఇంజన్ల సైడింగ్ కోసం వినియోగించనున్నారు.