- ఇండ్లు శాంక్షన్చేసి చేతులు దులుపుకొన్న గత సర్కార్
- మూడుసార్లు దరఖాస్తులు తీసుకొని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే..
- ఎక్కడి పనులు అక్కడే.. త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారుల విజ్ఞప్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు కొన్నిచోట్ల ఇండ్లు ఇచ్చినా చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేసింది. ఇప్పుడు ఫండ్స్ వస్తేగానీ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు. కొత్తగూడెం పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయాలంటే రూ.30 కోట్ల నిధులు కావాలని పీఆర్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.గత సర్కారు ఇండ్లను శాంక్షన్ చేసి చేతులు దులుపుకొందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
884 ఇండ్లలో ఒక్కటి కూడా పూర్తి కాలె..
కొత్తగూడెం పట్టణంలో గత బీఆర్ఎస్ సర్కారు 884 ఇండ్లను శాంక్షన్ చేసింది. దాదాపు రూ. 40కోట్లను కేటాయిస్తున్నట్టు అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దాదాపు ఎనిమిదేండ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఫండ్స్ రిలీజ్ఆగడంతో కాంట్రాక్టర్కూడా పనులు చేయడంలో జాప్యం చేశాడు.
రూ. 40కోట్లలో దాదాపు రూ. 15కోట్ల వరకు చెల్లించిన ప్రభుత్వం తర్వాత ఫండ్స్ రిలీజ్ చేయలేదు. మొత్తంలో ఒక్క బ్లాక్‌లోని కొన్ని ఇండ్లు మాత్రమే కొంత వరకు పూర్తి కావొచ్చాయి. మిగిలినవన్నీ పిల్లర్లు, స్లాబులు, గోడల స్థాయిలోనే ఉన్నాయి.
పనులు కాకుండానే ఇండ్ల కేటాయింపు..
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుంచి ఆఫీసర్లు రెండు సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ వాటి జాడ లేకుండా పోయాయి. ఏడాదిన్నర కిందట మూడోసారి దరఖాస్తులను తీసుకున్నారు. దాదాపు 5,686 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,470మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తి కాకున్నా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించింది.
ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తమ పరిస్థితేంటనే అయోమయంలో ఉన్నారు. అప్పడు కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఒక్కో లబ్ధిదారుడి వద్ద నుంచి రూ. 50వేల నుంచి రూ. 3లక్షల వరకు తీసుకున్నట్టుగా ప్రచారం సాగింది. ఏదేమైనా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇండ్లను పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రూ. 30 కోట్లు అవసరం..
పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసేందుకు దాదాపు రూ. 30కోట్లు అవసరమవుతుంది. ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇండ్ల నిర్మాణాల పొజిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అడిగింది. ఫండ్స్ రిలీజ్ అయితే ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం- శ్రీనివాస్, ఈఈ పంచాయతీ రాజ్, భద్రాద్రికొత్తగూడెం
ఆశగా ఎదురు చూస్తున్నాం..
నాకు డబుల్ బెడ్ రూమ్ఇల్లు ఎలాట్అయినట్టుగా ఆఫీసర్లు చెప్పినప్పుడు మస్తు సంతోషమైంది. కానీ ఏడాదిన్నర దాటినా ఇల్లు మాత్రం ఇయ్యట్లేదు. ఇయ్యాల, రేపు అంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి మాకు కేటాయించిన ఇండ్లను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలి. - సీహెచ్. కళావతి, మేదరబస్తీ, కొత్తగూడెం