అటు కేబుల్ బ్రిడ్జి.. ఇటు కాంక్రీట్ వాల్ .. రూ.800 కోట్ల విలువైన పనులకు శ్రీకారం

  • ఎండాకాలంలోనే  ఫౌండేషన్ పనులు పూర్తి చేసే ప్లాన్​

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో మున్నేరుపై రెండు ప్రధాన నిర్మాణాలకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఒకవైపు కాల్వొడ్డు సమీపంలో పాత బ్రిడ్జి పక్కనే తీగల వంతెన నిర్మించనున్నారు. దానికి సంబంధించిన ఫౌండేషన్​ పనులు జరుగుతున్నాయి. మరోవైపు మున్నేరు వరద ఖమ్మం నగరంలోకి, కాలనీల్లోకి రాకుండా రెండు వైపులా కాంక్రీట్ వాల్ నిర్మాణానికి జంగిల్ క్లీన్​ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం మున్నేరులో నీళ్లు లేకపోవడం, ఎండాకాలం వరద కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ సమయంలోనే ఫౌండేషన్​ పనులు స్పీడ్ గా జరిగే చాన్స్​ ఉంటుంది. కాల్వొడ్డు సమీపంలో మున్నేరుపై ప్రస్తుతం వందేళ్ల కింద నిర్మించిన పాత వంతెనపై రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మించనున్న హై లెవల్​ బ్రిడ్జి మొత్తం 420 మీటర్ల పొడవు ఉండనుంది. ఇందులో 320 మీటర్ల మేర తీగల వంతెన నిర్మాణం జరగనుంది. సూర్యాపేట, అశ్వారావుపేట జాతీయ రహదారిపై కిలోమీటర్​ 57/ 150 నుంచి 58/400 వరకు​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.

రూ.180 కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జి కాంట్రాక్టును నాసిక్​ కు చెందిన ఒక సంస్థ దక్కించుకోగా, ఆ సంస్థ సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి పనులు చేస్తున్నారు. పాత బ్రిడ్జికి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న శ్మశానం వైపు కొత్త బ్రిడ్జి రానుంది. పిల్లర్లు నిర్మించాల్సిన ప్రాంతంలో అవసరమైన సామగ్రి తెచ్చుకునేందుకు, వాహనాలు కిందికి వచ్చేందుకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మట్టి రోడ్డు లాంటి నిర్మాణం చేశారు. దానికి పక్కనే ప్రొక్లెయిన్లతో ప్రస్తుతం పిల్లర్ల కోసం భారీ గొయ్యి తవ్వుతున్నారు. ఎండాకాలంలోనే నీళ్లు లేని సమయంలో అండర్​ గ్రౌండ్​ నిర్మాణాన్ని పూర్తి చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్

మున్నేరు నది ప్రవహించే మార్గంలో పోలేపల్లి నుంచి ప్రకాశ్​నగర్​ వరకు 8.5 కిలోమీటర్ల పొడవులో నదికి రెండు వైపులా కలిసి 17 కిలోమీటర్ల మేర ఆర్సీసీ వాల్ నిర్మిస్తున్నారు.  మరో నాలుగు కిలోమీటర్ల మేర ఎర్త్ బండ్​ నిర్మించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయితే మున్నేరు ముంపు ప్రాంతంలో ఉన్న దాదాపు 20 కాలనీల్లోని వేల కుటుంబాలకు ఊరట కలగనుంది. గతేడాది మున్నేరు చరిత్రలోనే అత్యధికంగా 30.6 అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చింది.

దీంతో ఆ స్థాయికి మించి నీరు వచ్చినా తట్టుకునేలా మినిమమ్​ 6 మీటర్ల ఎత్తు నుంచి 11 మీటర్ల ఎత్తు(33 అడుగులు) వరకు, 8 మీటర్ల వెడల్పుతో గోడలు నిర్మిస్తారు. రెండు కిలోమీటర్లకు ఒక ఫ్లడ్​ బ్యాంక్​ చొప్పున మట్టి, రాతి కట్టల నిర్మాణం చేపడతారు. రెండు గోడల మధ్య దూరం 300 మీటర్లు ఉండేలా భూసేకరణ చేస్తున్నారు. నది మధ్య భాగం నుంచి 150 మీటర్లు ఉండేలా పెగ్ మార్కింగ్​ పూర్తి చేశారు.

గోడలకు బయటవైపు మురుగునీటి కాల్వలను నిర్మిస్తారు. 24 నెలల్లో ఈ వర్క్​ ను పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో ప్రధానమైన ఫౌండేషన్​ పనులను ఈ సమ్మర్​ లోనే మొదలు పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గోడ నిర్మించాల్సిన ప్రాంతంలో జంగిల్ కటింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుకున్న సమయంలోనే పనులు పూర్తి చేసేందుకు ప్లాన్​ చేస్తున్నామని అధికారులు  చెబుతున్నారు.

3 వేల ఇండ్లకు రక్షణ !

మున్నేరు వరద నుంచి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 3 వేల ఇండ్లకు రక్షణ కల్పించే కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. కాంక్రీట్ వాల్ పనులను హైదరాబాద్​ కు చెందిన పటేల్ ఇంజినీరింగ్ సంస్థ, మరో సంస్థ జాయింట్ వెంచర్​ తో కలిపి టెండర్​దక్కించుకుంది. మున్నేరుకు ఆర్సీసీ (రెయిన్​ ఫోర్సుడ్​ సిమెంట్ కాంక్రీట్) వాల్​ నిర్మాణానికి ఎన్నికల ముందు రూ.690.52 కోట్లతో గత ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో పన్నులు, భూసేకరణ, ఇతర ఖర్చులు లేకుండా వర్క్​ కాంపోనెంట్ రూ.501.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఏడాది జనవరిలో నీటి పారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది.