సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట, వెలుగు: స్టూడెంట్లలో వైజ్ఞానిక స్పృహ పెంచేందుకు చెకుముకి పోటీలు ఎంతో ఉపయోగపడుతాయని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ చెప్పారు. డీఈవో అశోక్‌తో కలిసి గురువారం కలెక్టరేట్‌లో చెకుముకి పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లను సైంటిస్టులుగా మార్చేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని సూచించారు.
ఈ పోటీల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్లు పాల్గొంటారన్నారు. స్కూల్ స్థాయిలో ఈ నెల 18, మండల స్థాయిలో 22, జిల్లాస్థాయిలో 27 తేదీల్లో పోటీలు జరగుతాయని, అలాగే డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సిరిసిల్లలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జి.రమేశ్‌బాబు, షేక్ జాఫర్, సభ్యులు నారాయణరెడ్డి, డి. జనార్దన్, కె. శ్రవణ్‌కుమార్, ఆంజనేయులు, ఈ.సైదులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు అందించాలి
అంగన్‌వాడీ కేంద్రం ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం మొబైల్ యాప్, సూపర్‌వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో సేవలు, పనులు, నెలవారీ రిపోర్టుల కోసం యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా అంగన్‌వాడీ టీచర్లపై పని భారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ, ఐటీ కోఆర్డినేటర్ రవికుమార్, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ పాల్గొన్నారు.