- ఓల్డ్‌సిటీపై సీఎం స్పెషల్ ఫోకస్..
- వేగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మెట్రో పనులు
- సర్కారు ఏర్పడిన ఏడాది లోపే భూసేకరణ ప్రారంభం
- అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే శంకుస్థాపన
- బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయింపు
- తాజాగా నిర్వాసితులకు చెక్కుల పంపిణీ
- డీపీఆర్లతో సంబంధం లేకుండా పనులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఇక్కట్లకు త్వరలోనే చెక్ పడనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పాతబస్తీలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గత మార్చిలో ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయగా, ఏడాదిలోపే భూసేకరణ దాకా వచ్చింది. ఈ నెలాఖరులో ఓల్డ్ సిటీ ప్రాంతలో మెట్రో నిర్మాణం కోసం రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం తమ ఆస్తులు ఇవ్వడానికి అంగీకరించిన నిర్వాసితులకు సంబంధించిన ఇండ్లను కూడా నెలాఖరులో కూల్చివేసి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఎవరూ ఊహించని విధంగా స్కైవేలు, ఫుట్ పాత్ నిర్మాణాలు, అధునాతన స్టేషన్లతో ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణం జరగనున్నది. ఇప్పటివరకు మూడు కారిడార్ల నిర్మాణం పూర్తి చేసి మెట్రో తన సేవలు కొనసాగిస్తుండగా, సెకండ్‌ఫేజ్‌లో ఐదు కారిడార్లు నిర్మించాలని ప్లాన్‌చేసి కేంద్రానికి డీపీఆర్లు పంపించింది. మరో రెండు, మూడు నెలల్లో వీటికి ఆమోద ముద్ర పడొచ్చని భావిస్తుండగా, ఎంజీబీఎస్నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న ఆరో కారిడార్‌ను మాత్రమే డీపీఆర్‌ల ఆమోదం లేకుండానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చకచకా పనులు చేయిస్తోంది. ఈ మార్గంలో మెట్రో నిర్మాణం పూర్తయితే, రోజు 70 వేల మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని మెట్రో అధికారుల సర్వేలో తేలింది.
భూసేకరణకు రూ.11 వందల కోట్లు
ఎంజీబీఎస్నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కి.మీ దూరంతో ఆరు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ. 2,741 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి శాలిబండ వరకు 60 అడుగులున్న రోడ్డును 100 అడుగులకు, శాలిబండ నుంచి ఫలక్‌నుమా వరకు 80 అడుగులున్న రోడ్డును 100 అడుగులకు విస్తరించనున్నారు. ఇందులో భాగంగా 1100 ఆస్తులు ప్రభావితమవుతున్నట్టు గుర్తించారు. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం భూసేకరణకు, తొలగించే నిర్మాణాలకు పరిహారం కలిపి రూ.1100 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 918 ఆస్తుల సేకరణకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్చేశారు.
మొదట స్క్వేర్యార్డుకు రూ.63 వేలు చెల్లించాలని నిర్ణయించినా నిర్వాసితులు అంగీకరించకపోవడంతో సీఎం చొరవ చూపి కన్సంట్ అవార్డు కింద నష్టపరిహారాన్ని స్క్వేర్యార్డుకు రూ. 81 వేలకు పెంచారు. దీంతో భూములు ఇవ్వడానికి169 మంది అంగీకరించగా, 34 ఆస్తులకు సంబంధించిన 41 మంది యజమానులకు రు. 20 కోట్ల నష్టపరిహారాన్ని సోమవారం చెల్లించారు. మిగతా వారికి కూడా త్వరలో చెక్కులు అందజేయనున్నారు.
కన్సంట్ అవార్డుకు దాదాపు అందరూ సుముఖంగా ఉన్నారని, కన్సంట్ అవార్డుకు ఒకేచెప్పని వారికి, భూములు, ఇండ్ల విషయంలో లీగల్ సమస్యలున్నవారికి జనరల్ అవార్డు కింద రూ. 63 వేలు చెల్లిస్తామని చెప్తున్నారు. జనరల్ అవార్డు తీసుకున్నవారు మాత్రమే ఆస్తుల సేకరణను సవాల్ చేస్తూ లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
మెట్రోపై 10 రివ్యూ మీటింగ్స్
హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్‌పెట్టారు. మెట్రోపై ఏడాది కాలంలో పదికి పైగా రివ్యూ మీటింగ్స్నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఓల్డ్ సిటీ మెట్రోకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఓల్డ్ సిటీ మెట్రోకు రూ. 500 కోట్లు, హెచ్ఎంఆర్ఎల్కు రూ.500 కోట్లు, ఎయిర్పోర్ట్మెట్రోకు రూ.100 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన అలైన్మెంట్లు మార్చారు. మరికొన్నింటిని రద్దు చేశారు. జనాలకు అవసరముంటుందని భావించిన కొత్త మార్గాలను కలిపారు. గత ప్రభుత్వం రాయదుర్గ్నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్వరకు మెట్రోను పొడిగించాలని నిర్ణయించగా.. దీన్ని రాయదుర్గ్నుంచి కోకాపేట్వరకు 11.6 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించింది. ఎయిర్‌పోర్ట్‌కు రాయదుర్గ్నుంచి కాకుండా నాగోల్‌నుంచి 36 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసింది.
గత డీపీఆర్లో ఎంజీబీఎస్నుంచి ఫలక్‌నుమా వరకు ఓల్డ్ సిటీ మెట్రో ఉండగా, దీన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించింది. ఈ మార్గం నాగోల్ టు ఎయిర్‌పోర్టుకు కలిసి ప్రయాణికులకు ఉపయోపగడనున్నది. అలాగే ఎల్బీనగర్‌నుంచి హయత్నగర్వరకు 7.1 కి.మీ మేర నిర్మించనున్నారు. మెట్రో ఫేజ్–2 పార్ట్ ఏలోని ఐదు కారిడార్లలో 76.4 కి.మీ, ఫేజ్–2 పార్ట్ బీ ఫ్యూచర్‌సిటీ 40 కి.మీ, నార్త్ సిటీ 45 కి.మీ సంబంధించి డీపీఆర్లు రూపుదిద్దుకుంటున్నాయి. నాలుగేండ్ల కాలంలో సాధ్యమైనంత వరకు ఫేజ్ 2 పూర్తి చేయడానికి సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారని మెట్రో అధికారులు చెప్తున్నారు.