మణిపూర్‌‌‌‌ కష్టకాలం త్వరలో ముగుస్తుంది: జస్టిస్ గవాయ్

మణిపూర్‌‌‌‌ కష్టకాలం త్వరలో ముగుస్తుంది: జస్టిస్ గవాయ్
  • అన్ని రాష్ట్రాల్లాగే అభివృద్ధి చెందుతుంది
  • ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి

ఇంఫాల్: మైతీ, -కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణల వల్ల అతలాకుతలమైన మణిపూర్‌‌‌‌లో త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఇందుకోసం కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు పూర్తి సహకారం అందిస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా మణిపూర్‌‌‌‌ కూడా దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

జాతి హింసను ఎదుర్కొంటున్న మణిపూర్‌‌‌‌లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రతినిధి బృందం శనివారం ఆ రాష్ట్రాన్ని సందర్శించింది. ఈ బృందంలో జస్టిస్ బీఆర్ గవాయ్ తోపాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ ఉన్నారు. ఉదయం ఇంఫాల్ విమానాశ్రయం చేరుకున్న వీరికి..మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. కృష్ణకుమార్, జస్టిస్ గోల్మెయ్ గైఫుల్షి సహా ప్రముఖ అడ్వకేట్లు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. 

అనంతరం న్యాయమూర్తులందరూ హెలికాప్టర్‌‌‌‌లో ఇంఫాల్ నుంచి చురచంద్‌‌‌‌పూర్‌‌‌‌కు వెళ్లారు. అయితే, చురచంద్‌‌‌‌పూర్ కుకీ కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న జిల్లా అయినందున అక్కడికి మైతీ కమ్యూనిటీకి చెందిన జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మాత్రం వెళ్లలేదు.