కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ బస్టాండ్‌లోని వాటర్ ట్యాంక్ కూల్చివేస్తుండగా శిథిలాల కింద పడి ఓ కూలి చనిపోయాడు. వరంగల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా శిథిలావస్థకు చేరిన పాత బస్టాండ్ కూల్చివేత పనులు ఇటీవల ప్రారంభించారు. మంగళవారం ట్యాంక్ కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు శిథిలాలు అక్కడున్న కూలీలపై పడ్డాయి. దీంతో కూల్చివేత పనుల కోసం వచ్చిన బొంత రవి(40)అనే కూలీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మృతుడిది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ. ఐదేండ్ల కింద గరీబ్ నగర్‌కు వచ్చి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇంతేజార్ గంజ్ సీఐ శివకుమార్ తెలిపారు. వాటర్ ట్యాంక్ కూల్చివేత పనులు చేస్తున్న సిబ్బంది అక్కడున్న కూలీలకు కనీస రక్షణ కల్పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.