
- ఎస్కార్ట్ స్ర్పింగ్ తెగి ఇనుప రేకులు మీద పడడంతో కార్మికుడు మృతి
- సూపర్వైజింగ్ లేకపోవడమే కారణమని కార్మిక సంఘాల ఆందోళన
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి స్టోర్స్‌లో జరిగిన ప్రమాదంలో కాసీపేట-2 బొగ్గు గనిలో పనిచేసే జనరల్మజ్దూర్ కార్మికుడు కర్రె రాజు(38) మృతిచెందాడు. సింగరేణి యాజమాన్యం సేఫ్టీ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదానికి కారణమని కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. శనివారం మొదటి షిప్టు విధుల్లో భాగంగా రాజుతో పాటు మరో ఆరుగురు మందమర్రిలోని ఏరియా స్టోర్స్నుంచి డబ్ల్యూ-స్ట్రప్స్ ఇనుప రేకులను(బొగ్గు గని పనిస్థలాల్లోని పైకప్పు కిందపడకుండా రక్షణగా వేసే రేకులు) తీసుకవెళ్లేందుకు లారీతో వచ్చారు.
ఉదయం 11.40 గంటల ప్రాంతంలో ఎస్కార్ట్ వెహికల్‌కు ఉన్న స్ప్రింగ్ తాడుకు డబ్ల్యూ- స్ట్రప్స్ రేకులు కట్టి లారీలో లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ తాడు తెగి కర్రె రాజుపై పడ్డాయి. సుమారు టన్నుకు పైగా బరువున్న ఇనుప రేకులు ఒక్కసారి మీదపడటంతో రాజు అక్కడిఅక్కడే మృతిచెందాడు. ప్రమాదం నుంచి మరో కార్మికుడు కొద్దిలో తప్పించుకున్నాడు. రాజు డెడ్‌బాడీని రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూమారుడు ఉన్నారు. బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో నివాసముంటున్నాడు.
యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కార్మికుడి ప్రాణాలు పోయాయని, ప్రమాదంపై ఎంక్వయిరీ చేసి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఏరియా స్టోర్స్‌ను, సింగరేణి ఏరియా ఆసుపత్రిని సీజీఎం సేఫ్టీ గురువయ్య, మందమర్రి ఏరియా జీఎం మనోహర్, ఎస్ఓటుజీఎం రాజేశ్వర్‌రెడ్డి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవిందర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రమాదంలో కార్మికుడు చనిపోవడం బాధాకరమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్విచారం వ్యక్తం చేశారు.
రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని రాజు డెడ్‌బాడీ వద్ద నివాళులర్పించారు. ప్రమాదంపై సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌తో మాట్లాడానని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, కార్మికుడి భార్యకు తగిన ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.