మెహిదీపట్నం, వెలుగు: పక్క షాపు ఓనర్‌తో నమ్మకంగా ఉన్న ఓ గుమాస్తా లాకర్లో పెట్టిన లక్షలు ఎత్తుకువెళ్లాడు. హైదరాబాద్‌లోని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి కథనం ప్రకారం..ఉప్పుగూడ కందికల్ గేట్‌కు చెందిన పూల వ్యాపారి మధుసూదన్ రెడ్డికి గుడిమల్కాపూర్ పూలమార్కెట్లో షాపు ఉంది. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వ్యాపారంలో వచ్చిన రూ. 7. 90 లక్షలను బుధవారం షాపులోని లాకర్లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు చూడగా డబ్బులు కనిపించలేదు. దీంతో గుడిమల్కాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు దర్యాప్తులో భాగంగా సీసీ పుటేజీ పరిశీలించి పక్క షాపులో గుమస్తాగా పని చేస్తున్న మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన గజానంద్ చోరీ చేసినట్టు గుర్తిం చారు. గజానంద్ అప్పుడప్పుడు మధుసూదన్ రెడ్డి షాపుకు వచ్చి నమ్మకమైన వ్యక్తిలా నటించేవాడు. మధుసూదన్ డబ్బులు పెట్టేది చూసేవాడు. బుధవారం కూడా గమనించి ఎవరూ చూడనప్పుడు షాపులోకి వచ్చి అటక ఎక్కి కూర్చున్నాడు.
అర్ధరాత్రి లాకర్లో డబ్బులు తీసుకొని వెనక డోర్ నుంచి పారిపోయాడు. పోలీసులు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి నిందితుడి సొంతూరుకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రూ. 6.20 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.