ఉద్యమ టైంలో ఎవరికీ తెలియని విషయాలు: విద్యాసాగర్ రావు 

  • పుస్తక రూపంలో బయటకు తెస్తా
  • టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం పని చేయాలె
  • మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్

కోనరావుపేట,వెలుగు: తెలంగాణ ఉద్యమ విషయాలు కొన్ని  ఎవరికీ తెలియవని, వాటిని త్వరలో ఒక పుస్తక రూపంలో బయటకు తీసుకువస్తానని మహారాష్ర్ట  మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్​ లీడర్ ​చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలిపారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఆయన సొంత గ్రామం నాగారంలో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్​టికెట్ ఎవరికిచ్చినా ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు  ఢిల్లీలో ఎంతో మందిని కలిశానని, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే బీజేపీ మద్దతు తెలపడంతోనే  రాష్ర్టం ఏర్పడిందన్నారు.

సుష్మా స్వరాజ్ ప్రత్యేక రాష్ర్టం కోసం ఎన్నోసార్లు కంటతడి పెట్టుకున్నారన్నారు. తన కొడుకు డాక్టర్ వికాస్ రావు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయబోతున్నారన్నారు. అంతకుముందు గ్రామానికి చెందిన  బలగం సినిమా నటుడు కీసరి నర్సింగం అనారోగ్యంతో బాధపడుతుండగా వెళ్లి పరామర్శించారు. విద్యాసాగర్​రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వేములవాడలో కాషాయ జెండా రెపరెపలాడాలని, అందుకోసం కష్టపడాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. విద్యాసాగర్​రావు కోడలు దీప, బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్రం, జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, మాజీ జడ్పీటీసీ అన్నపూర్ణ పాల్గొన్నారు.