బొగ్గు గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి

  •    హాలర్ తొలగింపు పనులు చేస్తుండగా ఘటన
  •     పనిస్థలంలో వెంటిలేషన్ లేకపోవడమే కారణమంటున్న కార్మికులు
  •     రక్షణ వారోత్సవాలు కొనసాగుతున్న టైమ్ లో ప్రమాదం

నస్పూర్/కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7 బొగ్గు గనిలో ప్రమాదం జరిగి ఫిట్టర్  సుర్మిల్ల వెంకటేశ్ (35) చనిపోయాడు. తోటి కార్మికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఫిట్టర్ విధులు నిర్వహించే వెంకటేశ్, మరికొందరు కార్మికులు కలిసి  మిడిల్  షిఫ్ట్  విధుల్లో భాగంగా బొగ్గు గనిలోని 2 లెవల్, 2ఏ సీం, ఎనిమిదో రేస్  వద్ద గల హాలర్ (బొగ్గు టబ్బులు లాగేందుకు) తొలగింపు పనులు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వెంకటేశ్ ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. 

వెంటనే బాధితుడిని రామకృష్ణాపూర్  సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు గంటల అనంతరం వెంకటేశ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని పేర్కొంటూ వారం రోజులుగా బొగ్గు గనులపై సింగరేణి యాజమాన్యం రక్షణ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆర్కే7 గనిలో కార్మికుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 

ALSO READ : టాటా మోటార్స్​ లాభం రూ. 3వేల783 కోట్లు

రక్షణ వారోత్సవాల పేరుతో కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఆఫీసర్లు.. పనిస్థలాల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు మండిపడ్డారు. ఆర్కే–7 బొగ్గు గని పనిస్థలంలో సరైన వెంటిలేషన్ లేకపోవడంతోనే ఫిట్టర్ వెంకటేశ్  ఊపిరాడక చనిపోయాడని కార్మికులు, కార్మిక సంఘాలు లీడర్లు ఆరోపించారు. హాలర్ తొలగింపు పనులు చేసే ప్రాంతంలో గాలిసరఫరా సక్రమంగా లేదని ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వెంకటేశ్  కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్  చేశారు.