గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 2వ గనిలో ప్రమాద ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గని అండర్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని కార్మికులు సోమవారం నిరసనకు దిగారు. మొదటి షిప్టులో అటెండెన్స్ పడిన తర్వాత విధులకు హాజరుకాకుండా గని ఆవరణలో బైఠాయించి నినాదాలు చేశారు. కార్మికులకు మద్దతుగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ సంఘాలకు చెందిన లీడర్లు నిలిచారు.
పలువురు లీడర్లు మాట్లాడుతూ పనిస్థలం వద్ద ప్రమాదకరంగా ఉందని మైనింగ్ సర్దార్ చెప్పినా వినిపించుకోకుండా అండర్ మేనేజర్ భరత్ కార్మికులతో డ్యూటీ చేయించాడన్నారు. కాగా సింగరేణి ఆర్జీ 1 జీఎం శ్రీనివాస్‌తో యూనియన్ లీడర్లు చర్చలు జరిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్, పా) ఎన్‌వీకే శ్రీనివాస్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం కే.హెచ్.ఎన్.గుప్తా, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బైద్య, మైన్ సేఫ్టీ అధికారి దొంత వెంకటేశ్వర్లు
ఉన్నారు.