కార్మికులలో స్కిల్స్ పెంచాలి: ప్రధాని మోదీ

కార్మికులలో స్కిల్స్ పెంచాలి: ప్రధాని మోదీ

జీ20 ఉపాధి, కార్మిక మంత్రుల సమావేశంలో ప్రధాని పిలుపు
టెక్నాలజీ యుగానికి అనుకూలంగా వర్క్​ఫోర్స్​ను సిద్ధం చేయాలని సూచన

ఇండోర్: కొత్త టెక్నాలజీకి అనుగుణంగా కార్మికుల్లో స్కిల్స్ పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జరిగిన జీ20 కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశంలో ప్రధాని ఆన్​లైన్​ ద్వారా మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఉపాధి కీలకమని, ప్రస్తుతం ఉపాధి రంగంలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని గుర్తుచేశారు. టెక్నాలజీయే ఉపాధిని నిర్ణయిస్తోందని, అందుకు తగినట్లుగానే కార్మికులు కొత్తకొత్త స్కిల్స్​ను పెంచుకోవాలని సూచించారు. కొత్త యుగం కార్మికులకు నైపుణ్యాలతో కూడిన కొత్త విధానాలు కావాలన్నారు.  


నైపుణ్యాలు పెంచుతూనే ఉండాలి..
యువకులు స్కిల్స్ మరింతగా పెంచుకోవాలని మోదీ సూచించారు. రాబోయే రోజుల్లో స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ శ్రామిక మంత్రాలుగా ఉండబోతున్నాయని అన్నారు. దేశంలో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ఇప్పటివరకు 1.25 కోట్ల మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఏఐ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీ వంటివాటిపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ ఉపయోగించేలా మనమంతా వర్క్​ఫోర్స్​ను రెడీ చేయాలని మంత్రులకు సూచించారు. ఒక దేశం నైపుణ్యాలను, అభివృద్ధిని ఇతర దేశాలతో షేర్ చేసుకోవాలని కోరారు. ఇందులో జీ20 దేశాలు కీలక పాత్ర పోషించాలన్నారు. సాంకేతికతతో కూడిన లెక్కలేనన్ని స్టార్టప్​లు ఇండియాలో ఉన్నాయని, అందులో ఇండోర్ కూడా ఒకటని మోదీ మెచ్చుకున్నారు.