కరీంనగర్ టౌన్, వెలుగు: జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర చోట్ల కార్మికుల సమ్మె కొనసాగింది. ఆయా పట్టణాల్లో స్వచ్ఛందంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. డ్రైవర్స్ చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైందని ఆల్ డ్రైవర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి అన్నారు. గురువారం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో రవాణ రంగం తీవ్రసంక్షోభంలోకూరుకుపోయిందన్నారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్, వెలుగు: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక , రైతు , ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ తీశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని అన్నారు. రైతులకు కనీస మద్దతు కల్పించాలని కోరారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.