ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

అశ్వారావుపేట, వెలుగు: అభివృద్ధి నినాదంతో పనిచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారాని కోసం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, తాను కలిసి జోడెద్దుల లెక్క పనిచేస్తున్నామని  ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎం ఆర్​ఎఫ్​ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. టౌన్ లో సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే కలిసి మద్దికొండ లో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాసాని వెంకటేశ్వరరావును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, అశ్వారావుపేట, దమ్మపేట జడ్పీటీసీలు చిన్నంశెట్టి వరలక్ష్మి పైడి వెంకటేశ్వరరావు, నాయకులు బండి పుల్లారావు, దొడ్డకుల రాజేశ్వరరావు పాల్గొన్నారు. 

తుమ్మలను కలిసిన ఎంపీ నామా    

దమ్మపేట : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తుమ్మల ఇంట్లో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. కొద్దిసేపు సమావేశం అనంతరం ఖమ్మం తిరుగు ప్రయాణం అయ్యారు. వీరితో పాటు దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు,ఎంపీపీ,దిశ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు. 

రేపటి నుంచి ఎంగిలి పూల బతుకమ్మ

అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మతో ముగింపు 

ఘనంగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 25 నుంచి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి  అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ దాకా పండుగను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ పండుగ ఏర్పాట్లపై అధికారులతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేండ్లుగా కొవిడ్ వల్ల పండుగ ఘనంగా జరగలేదని, ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లలో తెలంగాణ వంటకాలకు సంబంధించి ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫొటోగ్రఫీ, పెయింటింగ్ పోటీలు పెట్టాలని, నిమజ్జనం చేసే ప్రాంతాలలో లైటింగ్, సీసీకెమెరాలను ఏర్పాటుచేయాలన్నారు. బతుకమ్మ చీరెల పంపిణీ ఈ నెల 25 లోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రేషన్ కార్డులోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు చీరెలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో సీపీ విష్ణు ఎస్. వారియర్ , అడిషనల్​ కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సీఈ ఇరిగేషన్​ శంకర్ నాయక్, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ పాల్గొన్నారు. 

ముంపు బాధితులకు ఇండ్ల కోసం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్​

భద్రాచలం,వెలుగు : భద్రాచలంలో గోదావరి వరద ముంపు బాధితులకు పక్కా ఇండ్ల కోసం   స్థలాన్ని కలెక్టర్​ అనుదీప్​ శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. టౌన్​లోని ముంపునకు గురైన అయ్యప్ప, సుభాష్​నగర్​, అశోక్​నగర్​ కొత్తకాలనీ, ఏఎంసీకాలనీ,శాంతినగర్,శిల్పినగర్​ కాలనీల్లోని బాధితులకు 2వేల ఇండ్లతో మోడల్​కాలనీ నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా భద్రాచలం వ్యవసాయ మార్కెట్​ కమిటీ, కొత్త మార్కెట్​లలో ప్లేస్​లను పరిశీలించినట్టు, కొత్త మార్కెట్లోని కొన్ని షాపులను వేరే ప్రాంతాలకు తరలించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రెవెన్యూశాఖ ద్వారా సర్వే నివేదికల తెప్పించుకొని పరిశీలించిన కలెక్టర్​ మరోసారి ఈ ప్లేస్​లను చూశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వరరావు, తహసీల్దార్​ శ్రీనివాస్​యాదవ్​, ఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు. 

నేరాలు జరగకుండా చూడాలి

సమీక్షలో సీపీ విష్ణు ఎస్​ వారియర్​

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : జిల్లాలో శాంతిభద్రతలు ఎంత ముఖ్యమో, నేరాలు జరుగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​వారియర్​ అన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేరం జరిగిన తరువాత స్పందించే కంటే ముందస్తు నేర నివారణా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. రెండు నెలలుగా వివిధ బందోబస్త్​ విధులలో బిజీగా గడిపిన పోలీస్​ అధికారులు, విజిబుల్​ పోలీసింగ్​తో పాటు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతలు విఘాతం కలుగకుండా, అసాంఘీక కార్యకలాపాలకు తావివ్వకుండా, అక్రమ రవాణాను నివారించే ఉద్దేశ్యంతో వారానికి ఒకసారి కమ్యూనిటీ కనెక్ట్​ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. అలాగే ర్యాష్​ డ్రైవింగ్​, సౌండ్​ పొల్యూషన్​, ఈవ్​టీజింగ్​, అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకలను నియంత్రించాలని సూచించారు. ఖమ్మం డివిజన్​లో సెక్టార్​ల వారీగా బాధ్యతలు అప్పగించిన ఎస్​ఐలు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టిసారించాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏడీసీపీ ఆడ్మిన్​ డాక్టర్​ శబరీష్​, ఏడీసీపీ లాఅండ్​అర్డర్​ బోస్​, ఏడీసీపీ ఏఆర్​ కుమారస్వామి, ఏసీపీలు అంజనేయులు, రమేశ్​​, వెంకటేశ్​​, రవి, రమేశ్​​ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్​ విధినిర్వాహణలో విశిష్టసేవలకు ఇటీవల రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సేవా పతకాలను పోలీస్​ కమిషనర్​ వారికి అందజేసి ఘనంగా సత్కరించారు.

ఏపీ నుంచి ఆయిల్​ పామ్​ రాకుండా కట్టడి చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విస్తీర్ణం ప్రకారం వచ్చే ఆయిల్​పామ్​ గెలలనే తీసుకోవాలని కలెక్టర్​ అనుదీప్​ ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీ మేనేజర్లను శుక్రవారం  ఆదేశించారు. జిల్లాలో 38,793 ఎకరాల్లో ఆయిల్​పామ్​ను రైతులు సాగు చేస్తున్నారన్నారు. ఎఫ్​ కోడ్​ ఆధారంగా విస్తీర్ణం, దిగుబడి ప్రకారం మాత్రమే ఆయిల్​పామ్​ గెలలను తీసుకోవాలని అప్పారావు పేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల మేనేజర్లను ఆదేశించారు. తెలంగాణేతరులకు, కౌలు దారులకు కేటాయించిన ఎఫ్​ కోడ్​లను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఏపీ సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే ఆయిల్​పామ్​ గెలలను  యాజమాన్యం, రవాణా అధికారి, పోలీస్​, రెవెన్యూ అధికారుల సాయంతో నియంత్రించాలన్నారు. ఆయిల్​ పామ్​ గెలల సేకరణ కేంద్రాలున్న పాండురంగాపురం, సత్తుపల్లి, వైరా, ముదిగొండ, పెనుబల్లి, ఎర్రుపాలెం ప్రాంతాల రైతు వారీ ఎఫ్​ కోడ్​ ద్వారా మాత్రమే గెలలను ఫ్యాక్టరీ యజమానులు తీసుకోవాలన్నారు. 

ఫ్యాక్టరీ ఎదుట కౌలు రైతులు ఆందోళన 

దమ్మపేట: పామ్​ ఆయిల్​ పండించే కౌలు రైతుల ఎఫ్​ కోడ్​ రద్దు చేయాలని చెప్పడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కొనుగోళ్లను ఆపేసింది. దీంతో శుక్రవారం కౌలు రైతులు ఆందోళన చేశారు. ఫ్యాక్టరీకి ఫ్రూట్ లోడుతో వచ్చిన ట్రాక్టర్లను ఫ్యాక్టరీ గేట్​కు అడ్డంగా పెట్టి నిరసన చేశారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అసలు రైతులకు సమాచారం లేకుండా ఉత్తర్వులు జారీ చేసి ఫ్రూట్ కొనను అంటే ఎం చేసుకోవాలని కౌలు రైతులు ఆగ్రహించారు. రైతులకు ఎఫ్ కోడ్ విషయం క్లారిటీ వచ్చే వరకు ఫ్రూట్ కొనుగోలు చేయాలని పామ్​ ఆయిల్​ రైతు సంఘం స్టేట్​ ప్రెసిడెంట్ ఆలపాటి ప్రసాద్ డిమాండ్​ చేశారు. 

బతుకమ్మ చీరలు మహిళల గౌరవానికి ప్రతీక

ముదిగొండ, వెలుగు: మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఎమ్మెల్సీ తాతా మధు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ చీర తెలంగాణ ఆడపడుచుల గౌరవానికి ప్రతీక  అని అన్నారు. తెలంగాణ వచ్చాకే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కిందన్నారు. గుడుంబా, పేకాటను నిషేధించటం వల్ల ఎన్నో కుటుంబాలు బాగు పడ్డాయనీ చెప్పారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, డ్వాక్రా రుణ పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఖమ్మం మున్సిపల్​ చైర్మన్​ కమల్​ రాజ్​ మాట్లాడుతూ.. బతుకమ్మ అంటేనే కల్వకుంట్ల కవిత అని, పండుగను మధ్యలో కొన్నాళ్లు మనం జరుపుకోలేదనీ, మన పండుగను కవిత తన భుజాలకెత్తుకుని దేశ విదేశాలకు తీసుకెళ్లిందని అన్నారు. బతుకమ్మకు బ్రాండ్​ అంబాసిడర్​ కవితే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీటీ దామోదర్, సర్పంచులు మందరపు లక్ష్మీ, కోటి అనంతరాములు పాల్గొన్నారు. 

టీచర్లు పనితీరు మార్చుకోవాలి

చండ్రుగొండ, వెలుగు: స్టూడెంట్లకు పాఠాలు బోధించడంలో టీచర్ల పని తీరు మార్చుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ సోమశేఖర శర్మ ఆదేశించారు. శుక్రవారం సీతాయిగూడెం యూపీఎస్ స్కూల్ లో ప్రవేశపెట్టిన
తొలిమెట్టు కార్యక్రమాన్ని సడన్ విజిట్ చేశారు. క్లాస్ లో టీచర్ల బోధనాతీరును పరిశీలించి, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ టీచర్లు ప్రణాళిక తయారుచేసుకొని బోధించాలన్నారు. స్టూడెంట్ల ప్రగతి సరిగ్గా లేదని టీచర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజశేఖర్, హెచ్ఎం ఆరీఫ్ లు ఉన్నారు.