రైతు సంక్షేమానికి కృషి: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రైతు సంక్షేమానికి కృషి: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

చేవెళ్ల, వెలుగు: రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో శాసనమండలి చీప్ విఫ్ పట్నం మహేందర్​రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సోమవారం వారు పర్యటించారు. తొలుత చేవెళ్లలో డీసీఎంఎస్ గోదాం, దుకాణ సముదాయాలను ప్రారంభించారు. అనంతరం షాబాద్ మండలం సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్​గా పీసరి సురేందర్​రెడ్డి, వైస్ చైర్మన్​గా జంగయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లిలో రూ.5 కోట్ల చొప్పున నిర్మించనున్న బ్రిడ్జిల పనులకు శంకుస్థాపన చేశారు. సర్దార్​నగర్​లో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మొయినాబాద్ కొత్త మార్కెట్ పాటు కోహెడ దగ్గర మెగా మార్కెట్ను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా రైతాంగానికి భవిష్యత్తులో ఎలాంటి కష్టం లేకుండా చూస్తామన్నారు.