తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం 3వేల కోట్లకు పైగా ఇస్తుందన్నారు. సికింద్రాబాద్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఇది 2023 లో ప్రారంభించిన తొలి వందేభారత్ రైలు అని.. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ పండుగ కానుక అని మోడీ అన్నారు. దీన్ని ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన జర్నీ సాధ్యమవుతుందన్నారు. ఈ రైలుతో విలువైన సమయం ఆదా అవుతోందని చెప్పారు.
మారుతున్న దేశ భవిష్యత్కు వందేభారత్ ఉదాహరణ అని మోడీ అన్నారు. భద్రతతోపాటు రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎంతో ప్రయోజనకరమన్నారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్న మోడీ.. ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలను చేరుస్తుందన్నారు. కనెక్టివిటీతోనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రైల్వేలో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వందే భారత్ అన్ని రాష్ట్రాలను అనుసంధానిస్తుందని.. అతితక్కువ సమయంలో 8 వందేభారత్ రైలు ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు.