కార్ఖానాల్లో వెట్టిచాకిరి.. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్​కు పిల్లలు 

  •     42 మందికి విముక్తి కల్పించిన ఆఫీసర్లు
  •     21మంది అక్రమ రవాణాదారులపై కేసు

కాజీపేట, వరంగల్ సిటీ, వెలుగు:  హైదరాబాద్​ కార్ఖానాల్లో వెట్టిచాకిరీ చేయించేందుకు కొంతమంది దళారులు వివిధ రాష్ట్రాల నుంచి బాలకార్మికులను తీసుకెళ్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. బుధవారం రాత్రి బిహార్​లోని దర్బంగా నుంచి సికింద్రాబాద్​ వెళ్తున్న ఎక్స్​ ప్రెస్​ ట్రైన్​ లో 34 మంది బాల కార్మికులను ఆర్పీఎఫ్, బచ్​ పన్​ బచావో ఆందోళన్​, చైల్డ్​ లైన్​, డీసీపీవో ఆధ్వర్యంలో గుర్తించిన విషయం తెలిసిందే. వారందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో  హనుమకొండ వడ్డేపల్లి సమీపంలోని ఓయాసిస్​ అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. 34 మందిలో ముగ్గురు 18 ఏండ్లు దాటిన మేజర్లు ఉండగా, వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇంకో ముగ్గురు పిల్లల వయసు కూడా 18 ఏండ్లకు దగ్గర ఉండగా.. వారు తమ వద్దకే వస్తున్నట్లు వారి తల్లిదండ్రులు ఆఫీసర్లకు చెప్పారు. మిగతా పిల్లల గురించి కూడా వారి తల్లిదండ్రులతో పాటు బిహార్​చైల్డ్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు.  అక్రమ రవాణాకు పాల్పడిన 14మందిపై కాజీపేట స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు తెలిపారు.  గురువారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం నుంచి వరంగల్ వైపు వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో 11మంది బాల కార్మికులను రైల్వే పోలీసులు గుర్తించారు.  వారిని తరలిస్తున్న 7గురు దళారులను అదుపులోకి తీసుకున్నారు.