రోబో ఎంప్లాయీస్ జపాన్లో వాటి హవా.. ఉద్యోగుల కొరతకు పరిష్కారం

రోబో ఎంప్లాయీస్ జపాన్లో వాటి హవా.. ఉద్యోగుల కొరతకు పరిష్కారం

జపాన్​.. చిన్న దేశమే కానీ, టెక్నాలజీలో మాత్రం రారాజు. టయోట, సోనీ, మిత్సుబిషీ, హోండా వంటి కంపెనీలన్నీ అక్కడివే. కానీ, ఆ చిన్న దేశానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. వృద్ధులు పెరిగిపోవడం! అవును, అక్కడ యువత నానాటికీ తగ్గిపోతోంది.. వయసు మీద పడుతున్నోళ్లు పెరిగిపోతున్నారు. దాని వల్ల ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. మరి, దానికి జపాన్​ ఆలోచించిన పరిష్కారం ఏంటి? దానికి వచ్చే ఆన్సర్​.. ‘రోబో’! ఇప్పటికే స్కూళ్లు, నర్సింగ్​హోంలు, హోటళ్లు, సెక్యూరిటీ సంస్థల్లో రోబోలకు జపాన్​ ‘జాబ్స్​’ ఇచ్చేసింది. రోబో సినిమాలో సైంటిస్ట్​ రజినీకాంత్​.. తనలాగే ఉండే ‘చిట్టి’ రోబోను తయారు చేస్తాడు. ముందు బాగానే ఉండే ఆ రోబో.. ఎమోషన్స్​ అనే ఎక్స్​ట్రా ఫీచర్​తో విలన్​లా మారిపోతాడు. మరి, జపాన్​ రోబోల విషయంలో అది మంచిదేనా..? దాని వల్ల చెడు ఏమైనా ఉందా? ఓ లుక్కేద్దాం!!

అది టోక్యోలోని షినగవాలో ఓ పెద్ద ఆఫీసు. వర్కర్లు ఆఫీసులోకి వస్తున్నారు. అక్కడ డోరు దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వాళ్లను లోపలికి పంపుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు రోబో. బ్లూ కలర్​ పోలీస్​ క్యాప్​ పెట్టుకుని వీల్స్​తో అటూ ఇటూ చక్కర్లు కొట్టే ఆ రోబో పేరు ‘యుగో’. ఐదడుగుల ఎత్తుండే అది రెండు గంటలకొకసారి ఆఫీసును చుట్టేసి వస్తుంది. ఒక్క సారి డ్యూటీలో నిలబడితే సగం రోజు ఏకధాటిగా పనిచేసేలా దాని బ్యాటరీ ఉంటుంది. ఇక, అందులోని బిల్ట్​ఇన్​ కెమెరాతో ఆఫీసులోకి ఎవరొస్తున్నారు.. ఎవరు పోతున్నారు.. ఏం జరుగుతోందన్నది లోపల కూర్చున్న ఆఫీసర్లు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. యుగోను తయారు చేసింది జపాన్​కు చెందిన మీరా రోబోటిక్స్​ అనే సంస్థ. ప్రస్తుతం అలాంటివి రెండు ప్రొటోటైప్​లే ఉన్నాయట. అయితే, చైనా, దక్షిణ కొరియా నుంచి అలాంటి రోబోల తయారీ కోసం ఆర్డర్లు వస్తున్నాయని కంపెనీ సీఈవో కెన్​ మాత్సూయి చెప్పారు. ఆఫీసు వర్క్​ కోసం కాకుండా ఇళ్లలో పనులు చేసే పెట్టేవి, స్కూళ్లలో పాఠాలు చెప్పే రోబోలు కావాలట.

నర్సులూ.. రోబోలే

టోక్యోలోని సిల్వర్​ వింగ్​ నర్సింగ్​హోంకు వెళితే రోబో నర్సులు కనిపిస్తారు. రెండు డజన్ల మంది ఉద్యోగుల్లో అక్కడ పెప్పర్​ అనే ఓ రోబో నర్సు కూడా డ్యూటీ చేస్తుంటుంది. ఎక్సర్​సైజులు, గ్రూప్​ గేమ్స్​కు అదే లీడర్​. డిమెన్షియా పేషెంట్లకు అండగా ఉంటుంది. మతిమరుపుతో బాధపడే వాళ్లకు ‘గెస్​ కంజీ’ అనే గేమ్​ పెట్టి, వాళ్ల బుర్రను పదునెక్కిస్తుంది. ఒక్కో పేషెంట్​ పేరును గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, ఇలా రోబోలతో పనిచేయిస్తున్నామని సిల్వర్​ వింగ్​ డైరెక్టర్​ కిమియా ఇషికవా చెప్పారు. అయితే, రోగులకే కాదు, అక్కడ పనిచేసే నర్సులకూ రోబోటిక్​ ఎక్సోస్కెలెటన్​లు తోడ్పాటును అందిస్తున్నాయి. కారణం, జపాన్​లో దాదాపు 80 శాతం మంది నర్సులకు నడుం నొప్పులున్నాయట. దీంతో వాళ్ల నడుముకు సపోర్ట్​గా ఆ ఎక్సోస్కెలెటన్​లను అందిస్తోంది సిల్వర్​ వింగ్​. అదొక్కటే కాదు, మరికొన్ని నర్సింగ్​హోంలూ ఇలాంటి పరిష్కారాన్నే చూపించాయి. క్యోటోకు వంద కిలోమీటర్ల దూరంలోని హ్యోగోలో ఉన్న ర్యూసీ ఫుషికాయి సోషల్​ వెల్ఫేర్​ ఫౌండేషన్​లోనూ అలాంటి రోబోలున్నాయి. మాట్లాడే రోబో ‘పారో’ డ్యూటీలో ఉంటుంది. రోగులకు ఆలంబనగా నిలుస్తుంది. దాంతో పాటు కాళ్లు, చేతులు లేని ఓ చిన్ని టెలీనాయిడ్​నూ అక్కడ పెట్టారు. అది రోగుల కోసం పాటలు పాడుతుంది, కథలు చెబుతుంది, వారిని సంతోషంగా ఉంచుతుంది. ఒసాకా యూనివర్సిటీకి చెందిన హిరోషి ఇషిగురో దానిని తయారు చేశారు. రోబో సినిమాలో చిట్టి తెలుసుకదా.. సేమ్​ రజినీకాంత్​లాగానే ఉంటుంది. ఇదిగో, ఇషిగురో కూడా తనలాగే ఉండేలా దానికి రూపునిచ్చారు. దీంతో ఆయన జపాన్​ మొత్తం ఫేమస్​ అయ్యారు.

రోబోలే ముద్దు.. ఇమిగ్రేషన్​ వద్దు

నిజానికి ప్రస్తుతం జపాన్​లో హౌస్​ కీపింగ్​ వర్కర్లకు కొరత ఏర్పడుతోంది. దీంతో అలాంటి జాబ్​లతో పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేందుకు విదేశీయులకు అనుమతిచ్చింది జపాన్​. ఇమిగ్రేషన్​ రూల్స్​లోనూ మార్పులు చేసింది. కానీ, ఆ ఏరియాలోనూ రోబోల సాయం తీసుకోవాలని జపాన్​ భావిస్తోంది. అయితే, నిపుణులు మాత్రం అది ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యేది కాదని అంటున్నారు. చైనా, అమెరికా వంటి దేశాలు జపాన్​ను మించి హోమ్​కేర్​ రోబోటిక్స్​లో టెక్నాలజీని డెవలప్​ చేస్తున్నాయని ఏబీఐ రీసెర్చ్​ అనే సంస్థ తెలిపింది. ‘‘రోబోటిక్స్​లో జపానే టాప్​లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, జపాన్​తో పాటు జర్మనీ, దక్షిణకొరియా, సింగపూర్​, తైవాన్​ వంటి దేశాలు జపాన్​కు పోటీనిస్తున్నాయి. చైనా, అమెరికాతో పోటీలోనూ జపాన్​ వెనకబడే చాన్స్​ ఉంటుంది’’ అని ఏబీఐ అనలిస్ట్​ రియాన్​ విట్టన్​ చెప్పారు. జపాన్​తో పోలిస్తే దక్షిణ కొరియాలోనే ఎక్కువ ఇండస్ట్రియల్​ రోబోలున్నట్టు గత ఏడాది ఇంటర్నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ రోబోటిక్స్​ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించారు. ఆ దేశంలో ఎలక్ట్రానిక్స్, వాహనాల అసెంబ్లీ, వర్క్​ఫోర్స్​ కోసం వాటిని తయారు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. జర్మనీ కూడా అందులో వేగంగా దూసుకెళుతోందన్నారు.

డాక్టర్​ రోబోలు కూడా

మనిషి బాగా బతకాలంటే.. ఆరోగ్యం బాగుండాలి. కానీ, నేటి కాలంలో ఎప్పుడు ఏ రోగాలు వచ్చేది తెలియట్లేదు. దీంతో జనాల్లోని రోగాలను వెంటనే గుర్తుపట్టేందుకు, వాళ్లకు సలహాలిచ్చేందుకూ రోబోలు రూపుదిద్దుకోబోతున్నాయట. ఉదాహరణకు డిమెన్షియా పేషెంట్లనే తీసుకుంటే, వాళ్ల మాట తీరు, వాళ్లలో వచ్చిన మార్పులను పసిగట్టి వాళ్లకు పొంచి ఉన్న డేంజర్​ను ముందే లెక్కించేందుకు రోబోలు ఉపయోగపడతాయంటున్నారు. ఇక, రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలోనూ వాటితో మేలు జరుగుతుందంటున్నారు. ఇప్పటికే స్కూళ్లలోని 500 క్లాస్​ రూంలకు రోబో టీచర్లను తయారు చేయాల్సిందిగా జపాన్​ ఆర్డర్​ కూడా వేసింది. పిల్లలకు ఇంగ్లిష్​ పాఠాలు చెప్పేలా 23 లక్షల డాలర్ల నిధులూ ఇచ్చింది.