ఇన్ఫోసిస్ చీఫ్ చెప్పినా మనోళ్లు వినట్లే.. వారానికి 46 గంటలే పని చేస్తున్నరు

  • ఎక్కువ గంటలు పనిచేసే దేశాల లిస్టులో భారత్​ది 13వ స్థానం
  • టాప్​లో భూటాన్‌..తర్వాతి ప్లేస్​లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

న్యూఢిల్లీ: 'వారానికి పని గంటలెన్ని ఉండాలి?' అనే అంశం ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రోజుకొక వ్యాపారవేత్త ఒకరి తర్వాత ఒకరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో ఈ అంశంపై గత రెండేండ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ, 'వారానికి 70 గంటల పనిచేయాలి' అని ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి ఇటీవల చేసిన కామెంట్ తో మళ్లీ దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆయన తర్వాత లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ చీఫ్ ఎస్ఎన్ సుబ్రమణ్యం చేసిన "వారానికి 90 గంటలు పని చేయాలి" కామెంట్ దేశ వ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు మన దేశంలోని ప్రజలు వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఇతర దేశాల్లోని ప్రజలు వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఇతర దేశాలతో పోలిస్తే మన స్థానం ఎక్కడుందో తెలుసుకుందాం.  

ఎక్కువ గంటలు పనిలో భారత్​ది 13వ స్థానం

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) 2024 డేటా ప్రకారం..అత్యధిక పని గంటలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలోని ప్రజలు వారానికి సగటున 46.7 గంటలు పని చేస్తున్నారు. ప్రపంచంలోని వారానికి ఎక్కువ గంటలు పనిచేసే దేశాల లిస్టులో..భారత్ 13వ స్థానంలో ఉంది. అంతేగాక.. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 51 శాతం మంది వారానికి 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. అంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్న అధిక శ్రామిక శక్తి లిస్టులోనూ మనమే ముందున్నాం. డేటా ప్రకారం.. ఆ జాబితాలో భారత్ సెకండ్ ప్లేస్ లో ఉంది.

అందుకే మన దేశంలోని 62 శాతం మంది ఉద్యోగులు బర్న్‌అవుట్‌(మానసిక అలసట)తో బాధపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు 20% కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళనకర విషయం. అయితే,  వారానికి ఎక్కువ గంటలు పనిచేసే దేశాల లిస్టులోనూ, ఎక్కువ గంటలు పనిచేస్తున్న అధిక శ్రామిక శక్తి లిస్టులోనూ భూటానే అగ్రస్థానంలో ఉంది. భూటాన్‌లోని ఉద్యోగులు వారానికి సగటున 54.4 గంటలు పని చేస్తున్నారు. అందులోనూ 61 శాతం మంది కార్మికులు వారానికి 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. భూటాన్ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లెసోతో దేశాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ప్రజలు సగటున వారానికి 50.9 గంటలు, లెసోతో ప్రజలు వారానికి 50.4 గంటలు పనిచేస్తున్నారు. 

వనౌటులో 24.7 గంటలు మాత్రమే 

ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న ఓషియానియాలోని ద్వీప దేశమైన వనౌటు..ఉద్యోగులకు పనిగంటలు తక్కువగా ఉండే దేశాల్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ ప్రజలు వారానికి సగటున 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారు. అంతేగాక..కేవలం 4 శాతం మంది కార్మికులే వారానికి 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేస్తారు. ఇక, ఓషియానియాలోని మరో రెండు దేశాలు కిరిబాటి, మైక్రోనేసియాలో కూడా ఉద్యోగుల సగటు పని గంటలు తక్కువగా ఉన్నాయి. కిరిబాటిలో కార్మికులు వారానికి 27.3 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. మైక్రోనేసియాలో ప్రజలు వారానికి 30.4 గంటలు మాత్రమే పనిచేస్తారు.రెండు దేశాలలో, కేవలం 10% , 2% మంది మాత్రమే వారానికి 49 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఆఫ్రికన్ దేశాలైన రువాండా,  సోమాలియాలోని కార్మికులు కూడా వారానికి వరుసగా 30.4, 31.4 గంటలు పని చేస్తారు.