
రాయికోడ్, వెలుగు: రాష్ట్రంలోని నిజాం షుగర్ఫ్యాక్టరీల రీఓపెన్కు కృషి చేస్తున్నామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మాటూర్ గ్రామ శివారులో గోదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్ షుగర్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరుకు రైతులకు న్యాయం చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జహీరాబాద్ ఏరియాలోని చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభించలేదన్నారు.
దాంతో కర్నాటక, మహారాష్ట్రకు చెరుకు తరలించి రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. చెరుకు రైతులకు రావాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గోదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్ షుగర్ ఫ్యాక్టరీతో నారాయణ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గ చెరుకు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎంపీ బీబీ పాటిల్మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 3 వేల మంది కార్మికుల అవసరముంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులు నవీణ్చంద్ గోయాల్, సచిన్ గోయాల్ అండ్ బ్రదర్స్, వివేక్, మాజీ ఎంపీ సురేశ్షెట్కార్, షుగర్ కేన్ కమిషనర్ భద్రు మలహోత్ర తదితరులు పాల్గొన్నారు.