సీఆర్పీలపై పని భారం..అపార్, యూడైస్, ఓఎస్సీ సర్వేతోపాటు అన్ని పనులు వాళ్లకే

సీఆర్పీలపై పని భారం..అపార్, యూడైస్, ఓఎస్సీ సర్వేతోపాటు అన్ని పనులు వాళ్లకే
  • ఒత్తిడి ఎక్కువై అనారోగ్య సమస్యలు 
  •  ఏండ్లుగా చాలీచాలని జీతమే
  • ఉన్నత చదువులు చదివినా ఫోర్త్​ క్లాస్​ ఎంప్లాయ్​ పనులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టపరచడంలో కీలకంగా వ్యవహరిస్తున్న క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ పనిభారంతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 56 క్లస్టర్లు ఉండగా 52 క్లస్టర్లలో సీఆర్పీలు పనిచేస్తున్నారు. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న పనివల్ల తాము కుంగిపోతున్నామని, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. బీఈడీ పూర్తి చేసి టెట్ పాసైన తమతో సర్వేలు, ఆపార్ లాంటి పనులే కాకుండా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చేసే వర్క్స్​కూడా చేయిస్తున్నారని వాపోతున్నారు. 

ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి ఏ స్కీమ్ తీసుకొచ్చినా అమలు బాధ్యత తమపైనే ఉంటుందని, పని చేయడానికి ఇబ్బంది లేదని, కానీ ఓవర్​బర్డెన్​వల్ల ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. చాలా స్కూళ్లలో ఫోర్త్​ క్లాస్​ఎంప్లాయ్స్​చేసే పనులను కూడా తమతో చేయిస్తున్నారని వాపోతున్నారు. సమగ్రశిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న తాము, ఏండ్లుగా చాలీచాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఒక్కటా..రెండా..

సీఆర్పీలు..హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులకు వారధులగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రోగ్రామ్ ను  ప్రతి స్కూల్​లో ఇంప్లిమెంట్ చేసేలా చూస్తారు. స్కూళ్లు మొదలైనప్పటి నుంచి యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ, ఔట్ ఆఫ్​స్కూల్ చిల్డ్రన్ సర్వేలు, డేటా ఎంట్రీ ఇలా ఏమున్నా సీఆర్పీలే చేయాల్సి ఉంటుంది. వారి జీపీఈపీఎఫ్​అప్డేట్ చేయించడం, స్టూడెంట్స్​అపార్ ఐడీ జనరేట్​చేయడం వంటివి చేయాలి. సర్కారు స్కూల్స్​తో పాటు ప్రైవేటు, ఎయిడెడ్​, ఇంటర్మీడియట్ కాలేజీలను విజిట్ చేసి ఆపార్ ఐడీ ఎలా జనరేట్ చేయాలో వివరించాలి. 

ఎఫ్ ఆర్ఎస్ (ఫేషియల్​రికగ్నైజేషన్​సిస్టమ్) అటెండెన్స్​విషయంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్​చేయాలి. ప్రతిరోజూ స్కూల్ వైజ్​గా,  క్లాస్ వైజ్​గా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పర్సంటేజ్ చూసి స్కూల్స్ కి కాల్ చేసి చెప్పడంతో పాటు, లాంగ్ ఆబ్సెంటీస్ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లలను రెగ్యులర్ గా స్కూల్​కు పంపించాలని చెప్పాలి. క్లస్టర్ పరిధిలో ప్రతిరోజు తప్పనిసరిగా ఒక స్కూల్ ను విజిట్ చేసి, ఆరోజు ఆ స్కూల్ లో టీచర్లు ఎంతమంది అటెండ్ అయ్యారో డేటా కలెక్ట్ చేసుకోవాలి. డోర్ టు డోర్ ఓఎస్సీ సర్వే నిర్వహించి బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి. 

టీచర్లు లాంగ్ లీవ్ లో ఉంటే, వారి స్థానంలో పిల్లలకు పాఠాలు చెప్పాలి.  ప్రతి నెలా కాంప్లెక్స్ మీటింగులు, పేరెంట్స్ మీటింగులు నిర్వహించాల్సింది కూడా సీఆర్పీలే. చివరకు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణలో భాగంగా డబుల్ బెడ్​రూం ఇండ్లకు తరలించిన నిర్వాసిత కుటుంబాల్లోని పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించడం కూడా చేస్తున్నారు. దీంతో పనిభారం ఎక్కువై సతమతమవుతున్నారు. తమపై పని భారం తగ్గించాలని, శాలరీ పెంచాలని, ఉద్యోగాలను రెగ్యులరైజ్​చేయాలని కోరుతున్నారు.