- రాష్ట్రంలో కోటి 11 లక్షల మందికి ఉపాధి
- వచ్చే నెల నుంచి కూలీలకు రూ.300 చెల్లింపు
- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు
- లక్ష మందికి పైగా 100 రోజుల పని పూర్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు తగ్గడంతో నెల రోజులుగా ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువగా వస్తున్నారు. దీంతో చెరువుల్లో పూడికతీత పనులు, కందకాలు, ప్లాంటేషన్, నర్సరీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములను సాగుకు అనుకూలంగా మార్చడం, చెరువుల నుంచి పొలాలకు వెళ్లే కాలువల్లో పూడిక తీయడం, ఇంకుడు గుంతలు తవ్వడం, నీరు నిలిచి ఉండేలా మట్టి తీయడం, నాలాలు పూడిక తీయడం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, తండాలు, ఆవాసాల్లో ఉపాధి హామీ పనులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. జాబ్ కార్డులేని వాళ్లు పంచాయతీ సెక్రటరీలను, స్పెషల్ ఆఫీసర్లను (సర్పంచ్ ల టర్మ్ పూర్తి అయినందున) ఆశ్రయిస్తున్నారు. వీళ్లు వివరాలు తీసుకొని మండల కేంద్రాలకు పంపిస్తున్నరు. ఉపాధి చట్టం ప్రకారం15 రోజుల్లో జాబ్ కార్డులు మంజూరు చేయాలనే రూల్ ఉండగా వారంలోగా ఇస్తున్నామని రూరల్ డెవలప్ మెంట్ అధికారులు చెబుతున్నారు. కార్డు రాకపోయినా 2 రోజుల్లో జాబ్ కార్డు నంబర్ ఇస్తున్నామని, వెంటనే పనికి వచ్చే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు.
కోటి మందికి పైగా పనిదినాలు
రాష్ట్రంలో 53.03 లక్షల జాబ్ కార్డులు ఉండగా అందులో 1 కోటి 11లక్షల 31వేల మంది కూలీలు ఉన్నారు. వారిలో 61.12 లక్షల మంది కార్మికులు కూలి పనులకు హాజరవుతున్నారని రూరల్ డెవలప్ మెంట్ అధికారులు చెప్పారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 11కోట్ల 62 లక్షల పని రోజులను కేంద్రం కేటాయించింది. కూలీలకు వేతనంచెల్లించేందుకు కేంద్రం రూ.10.50 కోట్ల బడ్జెట్ ను మన రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి కూలీలకు రూ.272 వేతనం చెల్లించగా 2024–25 సంవత్సరానికి ఈ కూలిని రూ.300కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30 నాటికి 1,13,181 మందికి 100 రోజుల పని కల్పించామని రూరల్ డెవలప్ మెంట్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కూలీలకు రక్షణ ఏర్పాటు
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు అధికంగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 తరువాత పనుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు ఎండ నుంచి రక్షణ కలిగించేలా షెడ్లు నిర్మించారు. అలాగే తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉంచాయి.
వేగంగా పనులు జరుగుతున్నయి
గత నెల రోజులుగా ఉపాధి హామీ పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువుల్లో పూడిక తీయడం, చెరువుల నుంచి రైతుల పొలాల దగ్గరకు నీళ్లు వెళ్లేలా ఫీడర్ చానెళ్లు నిర్మించడం వంటి పనులు జరుగుతున్నాయి. కూలి కూడా గిట్టుబాటు అవుతోంది. వచ్చే నెల నుంచి కూలి రేటు పెరుగుతోంది. ఎండలు అధికంగా ఉన్నందున కూలీలకు తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను గ్రామ పంచాయతీలు అందిస్తున్నాయి. చాలా మంది కూలీలకు 100 రోజుల పనిపూర్తయింది. వచ్చే నెల నుంచి కూలీల సంఖ్య మరింత పెరగనుంది.
‑ బాబు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్,
సిద్దిపేట జిల్లా, అర్జునపట్ట గ్రామం