గ్రేటర్ హైదరాబాద్‌లో నాలాల పూడికతీత పనులను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. రూ.38.24కోట్లతో పనులు చేపట్టింది. గ్రేటర్లో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురికి కాలువలు, వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వీటిలో 216 మేజర్ నాలాలు, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్‌లైన్ డ్రెయిన్‌లు, చిన్న సైజు డ్రెయిన్‌లు ఉన్నాయి. మేజర్ నాలాల్లో మిషన్ల ద్వారా, పైప్‌లైన్ డ్రెయిన్లలో రిసైకలర్స్ద్వారా, చిన్న సైజు నాలాల్లో మ్యాన్యువల్‌గా పనులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులను ప్రారంభించింది. గతంలో వర్షాకాలానికి నెల రోజుల ముందు పూడిక తీసి పూర్తికాగానే నిలిపివేసేవాళ్లు. ఈసారి ఏడాది మొత్తం పూడిక పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 83 మేజర్ నాలాల్లో యంత్రాల ద్వారా, 23 డ్రెయిన్లలో రీసైకలర్స్ద్వారా, 214 చిన్న సైజు నాలాల్లో మ్యాన్యువల్‌గా పూడిక తీస్తున్నారు. అలాగే పూడిక మట్టిని సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించింది. మే నెలాఖరులోగా100% పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్దానకిశోర్అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పనుల్లో సోషల్ ఆడిట్
పూడిక పనుల్లో ఏవిధమైన ఆరోపణలు తలెత్తకుండా సోషల్ ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. తొలగించిన మట్టి పరిమాణాన్ని, తరలించిన వివరాలు, కూలీలు, జేసీబీలతో కూడిన వివరాలను పొందుపరిచి స్థానిక ప్రముఖులతో సంతకాలు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 92.10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పనులు పూర్తయ్యాయి.