- ఏడాదికి పైగా నిలిచిన మల్లన్న సాగర్, తపాసుపల్లి కాల్వ పనులు
- ఏండ్ల తరబడి పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు
సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కొమురవెల్లి మండలం తపాసుపల్లి రిజర్వాయర్ కు నీటి తరలింపు కోసం ప్రారంభించిన కాల్వ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కాల్వ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను సేకరించినా పరిహారాలు అందకపోవడంతో ఏడాదికి పైగా పనులు నిలిచిపోయాయి. తొగుట మండలం మల్లన్న సాగర్ నుంచి తపాసుపల్లి రిజర్వాయర్ వరకు కాల్వ నిర్మాణం కోసం కుకునూరుపల్లి, కొమురవెల్లి మండలాలకు చెందిన రైతుల నుంచి మూడేళ్ల కింద అధికారులు భూములు సేకరించారు.
మొత్తం పది కిలోమీటర్ల కాల్వ లో కొంత భాగం టన్నెల్, మరికొంత భాగాన్ని ఓపెన్ కెనాల్ గా నిర్మించాలని నిర్ణయించారు. టన్నెల్ నిర్మాణం జరిగే ప్రాంతంలోని రైతులకు ఒక సీజన్ పంట నష్టం కింద పరిహారం చెల్లించినా భూములకు మాత్రం పెండింగ్ లో పెట్టారు. కుకునూరుపల్లి మండలం లకుడారం, మెథినిపూర్, కొనాయిపల్లి, మంగోల్, కొమురవెల్లి మండలం తపాసుపల్లి గ్రామాల నుంచి దాదాపు 150 మంది రైతుల నుంచి 178 ఎకరాలను సేకరించారు. ఓపెన్ కెనాల్ కోసం సేకరించిన భూమికి ఎకరాకు రూ.16 లక్షలు, పైప్ లైన్ వేసిన చోట ప్రత్యేక పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చి పనులు ప్రారంభించారు. కానీ ఏండ్లు గడిచినా పరిహారం ఇవ్వక పోవడంతో రైతుల ఆందోళనతో ఏడాది కింద పనులన్నీ ఆగిపోయాయి.
ఆగిపోయిన కాల్వ పనులు
తపాసుపల్లి రిజర్వాయర్ కు దేవాదుల ప్రాజెక్టు దూరంగా ఉండడంతో సమీపంలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 290 కోట్లతో ప్రత్యేక కాల్వ ద్వారా నీటిని తరలించాలని బీఆర్ఎస్ప్రభుత్వం నిర్ణయించింది. కాల్వ నిర్మాణం కోసం కుకునూరుపల్లి మండలం మంగోల్ లో 51, మేథినిపూర్ 49, కొనాయిపల్లి లో 28, లకుడారం 20, కొమురవెల్లి మండలం తపాసుపల్లిలో30 ఎకరాలు కలిపి మొత్తం 178 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. మొత్తం కెనాల్ నిర్మాణంలో 6 కిలోమీటర్లు టన్నెల్, 4.5 కిలో మీటర్లు ఓపెన్ కెనాల్ పనులను ప్రారంభించారు.
కుకునూరుపల్లి తిప్పారం నుంచి ఓపెన్ కెనాల్స్ తో గ్రావిటీ ద్వారా మల్లన్న సాగర్ నుంచి నీటిని తక్కువ ఖర్చుతో తపాసుపల్లి రిజర్వాయర్ కు తరలించడానికి ప్రణాళిక రూపొందించారు. కానీ భూసేకరణ కోసం రూ.30 కోట్లు అవసరం కాగా బీఆర్ఎస్ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వాసితుల ఆందోళనతో పనులు నిలిచిపోయాయి.
సాగునీటి అవసరాల కోసం..
సిద్దిపేట, జనగామ జిల్లాల పరిధిలో 1.24 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించాలని బీఆర్ఎస్ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి తపాసుపల్లి రిజర్వాయర్ కు కాల్వ తవ్వాలని నిర్ణయించింది. దీంతో సిద్దిపేట జిల్లాలోని కొండపాక, కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు మండలాల్లోని 82 వేల ఎకరాలకు జనగామ జిల్లా పరిధిలో బచ్చన్నపేట, జనగాం, నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని 42 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని భావించింది. కానీ సరైన విధంగా నిధులు కేటాయించక పోవడంతో రైతులకు పరిహారాలు అందక పనులన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. తవ్విన ఓపెన్ కెనాల్స్ వరద నీటితో నిండిపోయాయి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
మల్లన్న సాగర్ నుంచి తపాసుపల్లి రిజర్వాయర్ వరకు కాల్వ నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూముల పరిహారాల చెల్లింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ పరిహారాలకు దాదాపు రూ.30 కోట్లు అవసరమవుతాయి. నిధులు మంజూరు కాగానే రైతులకు పరిహారాలను అందజేస్తాం.
- మల్లికార్జున్, తహసీల్దార్, కుకునూరుపల్లి