మన ఊరు–మన బడి... పనులు ఎక్కడివక్కడే

  • ఫండ్స్​రాక పూర్తికాని పనులు 
  • ఉమ్మడి జిల్లాలో 850 స్కూళ్లకు 103 స్కూళ్లలోనే పూర్తి
  • చేసినవాటికి బిల్లులు రాక మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్లు
  •  పైసల్లేక కొన్ని స్కూళ్లలో పనులే ప్రారంభం కాలే

కరీంనగర్, వెలుగు: సర్కార్ స్కూళ్లలో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులు పైసల్లేక ఉమ్మడి జిల్లాలో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు తెచ్చి చేయలేక  కాంట్రాక్టర్లు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలు చేతులెత్తేశారు.  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 850 స్కూళ్లు ఎంపికయ్యాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలో  213 స్కూళ్లు, జగిత్యాలలో 274, పెద్దపల్లి జిల్లాలో 191,  రాజన్న సిరిసిల్లలో 172 స్కూళ్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో 16, పెద్దపల్లి జిల్లాలో 35, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 36 స్కూళ్లు కలిపి మొత్తం 103 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా స్కూళ్లలో 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నప్పటికీ ఫీల్డ్ లో పరిస్థితిలో వేరేలా ఉంది. కొన్ని చోట్లయితే ఇప్పటివరకు పనులే ప్రారంభం కాలేదు. 

బిల్లులు రాక పనులు బంద్.. 

‘మన ఊరు– మన బడి’ కార్యక్రమానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించలేదు.  సమగ్ర శిక్ష అభియాన్, నియోజకవర్గ డెవలప్‌మెంట్ ఫండ్(సీడీఎఫ్), జడ్పీ, మండల పరిషత్ ఫండ్స్‌, ఉపాధి హామీ స్కీమ్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ తో పాటు నాబార్డ్ నుంచి నిధులు సమీకరిస్తామని సర్కార్ గతంలో ప్రకటించింది. రూ.3‌‌లక్షల్లోపు విలువైన పనులను సంబంధిత స్కూల్ మేనేజ్ మెంట్(ఎస్‌ఎంసీ) కమిటీలు చేపట్టే వీలుంది. రూ.30 లక్షలు దాటితే కాంట్రాక్టర్లతో పనులు చేయించాల్సి ఉంటుంది. అయితే ఆయా విభాగాల నుంచి ఫండ్స్ విడుదలలో జాప్యం జరగడంతో పనులు చేపట్టిన ఎస్ఎంసీలు, కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే మిగతా పనులు పూర్తి చేస్తామని ఆఫీసర్లకు తెగేసి చెప్తున్నారు. దీంతో వారిని కన్విన్స్ చేయడం, పనులు పూర్తి చేయించడం విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. 

‘జమ్మికుంట మండలం వావిలాల హైస్కూల్ అభివృద్ధికి ‘మన ఊరు - మన బడి’ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించింది.  ఇందులో రూ.14 లక్షలతో డైనింగ్ హాల్, మిగతా నిధులతో మంచినీటి సప్లై, డోర్స్, కిటికీలు, మైనర్ రిపేర్లు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డైనింగ్ హాల్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. పనులు త్వరితగతిన పూర్తి కాకపోవడంతో ఈ పనులను మరో కాంట్రాక్టర్ కు అప్పగించారు. పైసలు రాకపోవపోవడంతో పనులు జరగడం లేదు.’

నిలిచిన టాయిలెట్స్ నిర్మాణ పనులు  

‘చొప్పదండి మండలం రాగంపేట జడ్పీ హైస్కూల్ లో సుమారు150 మందికిపైగా  విద్యార్థులున్నారు. ఈ స్కూల్ లో టాయిలెట్స్, హ్యాండ్ వాష్ కోసం వాష్ బేసిన్లు, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టారు. 20 రోజుల కింద చేపట్టడంతో కాంట్రాక్టర్ డైనింగ్ హాల్ నిర్మాణ పనులు ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వాష్ బేషన్స్, టాయిలెట్స్ నిర్మాణ పనులు కొంతవరకు చేసి ఆపేశారు. ప్రస్తుతం స్కూల్ స్టార్ట్ కావడంతో టాయిలెట్స్ పూర్తిస్థాయిలో లేక స్టూడెంట్స్‌ ఇబ్బందిపడుతున్నారు. టాయిలెట్స్ త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లామని టీచర్స్ చెబుతున్నారు. చొప్పదండి మండలంలో తొమ్మిది స్కూళ్లకు ఆర్నకొండ హైస్కూల్ లో మాత్రమే వర్క్ పూర్తి చేశారు. ’

ఒక్క పని కూడా పూర్తి కాలే.. 

‘హుజూరాబాద్ హైస్కూల్ లో సుమారు 45‌‌మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ‘మన ఊరు- మన బడి’  స్కీమ్ కింద ఈ స్కూల్ లో డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణ పనులను ఐదు నెలల కింద స్టార్ట్ చేశారు. కానీ బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ డైనింగ్ హాల్ పనులను గోడలు, పిల్లర్ల దశలో, కిచెన్ పనులను బేస్ మెంట్ దశలోనే నిలిపివేశారు. ఎలక్ట్రిఫికేషన్, మైనర్ పనులను ఇంకా మొదలుపెట్టలేదు.’