సూర్యాపేట, వెలుగు:ప్రైవేటుకు దీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని పదేపదే చెబుతున్న అధికార పార్టీ లీడర్ల మాటలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయి. ‘మన ఊరు మన బడి’ కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని ఏడాది కింద సూర్యాపేట జిల్లాలో 329 స్కూళ్లను ఎంపిక చేశారు. కానీ అందులో ఇప్పటి వరకు పూర్తయినవి 35 మాత్రమే. ఇంకా సగం స్కూళ్లలో పనులే మొదలు కాలేదు. స్టార్ట్అయిన చాలా చోట్ల బిల్లులు రాక వర్క్స్ ఆగిపోయాయి. జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి.
వీటిలో మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కింద మొదటి విడతలో 329 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో 215 పీఎస్, 23 యూపీఎస్, 91 హై స్కూళ్లు ఉన్నాయి. మన ఊరు -మన బడి కింద 279 స్కూళ్లు, మన బస్తి -మన బడి కింద 50 స్కూళ్లు ఎంపిక చేశారు. ఈ స్కూళ్లను బాగు చేసేందుకు ప్రభుత్వం రూ. 117.31కోట్లు విడుదల చేసింది. ఇందులో ఎంఓఎంబీ బడ్జెట్ రూ. 75.41కోట్లు, ఎన్‌ఆర్‌ఈజజీఎస్ బడ్జెట్ రూ.8.42కోట్లు, సీపీఎం( సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరీయల్ బడ్జెట్) రూ.33.47కోట్లు కేటాయించి పనులను ప్రారంభించారు.
పనులు కావట్లే.. పాట్లు తప్పట్లే..
జిల్లాలోని చాలా స్కూళ్లలో తరగతి గదుల కొరత వేధిస్తోంది. కొన్ని స్కూళ్లలో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు నేర్రలు బారాయి. పై కప్పు ఊడిపోయేలా చాలా గదులు ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని టీచర్లు, స్టూడెంట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మన ఊరు మన బడి కింద గతేడాది స్కూళ్ల రిపేర్ పనులు ప్రారంభించినా ముందుకు సాగడం లేదు. దీంతో స్టూడెంట్స్చెట్లకిందనే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మన ఊరు -మన బడి కింద ఆయా స్కూళ్లలో పనులకు రూ.16.06కోట్లు బిల్లులు చెల్లించారు. మిగతా నిధులు ఇంకా రాకపోవడంతో చాలా స్కూళ్లలోని పనుల్లో డిలే కొనసాగుతోంది. మరికొన్ని స్కూళ్లలో పూర్తిగా ఆగిపోయాయి. ఇంకొన్ని స్కూళ్లలో పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా పనులను స్పీడప్ చేసి త్వరగా అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
ఇది మునగాల మండలంలోని తిమ్మారెడ్డి గూడెంలోని స్కూల్. ఇందులో 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రెండు గదులూ శిథిలావస్థకు చేరాయి. భవనం పై పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో చెట్ల కిందనే పాఠాలు కొనసాగుతున్నాయి.
ఇది గరిడేపల్లి మండలం గడ్డిపల్లి మోడల్ స్కూల్ లో బాయ్స్ టాయిలెట్స్ పరిస్థితి. 500 మంది స్టూడెంట్స్ వరకు ఉన్న ఈ స్కూల్లో టాయిలెట్స్ సరిగాలేక బయటికి వెళ్తున్నారు. ఐదేండ్ల నుంచి పిల్లలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునేవారు లేరు.
ఇది తుంగతుర్తిలోని హైస్కూల్. ఇందులో దాదాపు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 ఏండ్ల కింద ఈ బడిని కట్టారు. దీంతో తరగతి గదులు అధ్వాన స్థితికి చేరాయి. స్టూడెంట్స్కు సరిపోను గదులు కూడా లేవు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.