- గడువు దగ్గర పడుతున్నా పూర్తికాని స్లాబ్వర్క్స్
- వానలొస్తే పోచమ్మకుంట, అంబేద్కర్ భవన్ దారిలో ప్రయాణం కష్టమంటున్న ప్రజలు
- మంత్రి, లోకల్ ఎమ్మెల్యే చొరవ చూపితేనే పనుల్లో వేగానికి అవకాశం
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నయీంనగర్ బ్రిడ్జి పనులు రెండున్నర నెలలుగా కొనసాగుతున్నాయి. దీంతో లోకల్ జనాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే సిటీలోని నయీంనగర్ నాలా ప్రాంతం ఏండ్ల తరబడి వణుకుతోంది. వరదనీటితో కాలనీలన్నీ నీట మునుగుతుండగా, హనుమకొండ నుంచి కరీంనగర్ రూట్లో వెళ్లే ప్రయాణికులు రెండు, మూడ్రోజులు ఈ బ్రిడ్జి దాటలేని పరిస్థితులు ఉండేవి.
ఈ క్రమంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండున్నర నెలలకింద నయీంనగర్ బ్రిడ్జిని కూల్చి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, అధికారులు పెట్టుకున్న డెడ్‍లైన్ దగ్గరకొచ్చినా పనులు ఇంకా స్లాబ్ దశకు చేరలేదు. పెద్ద వానలు పడితే వరద వస్తుందని జనాలు టెన్షన్ పడ్తున్నారు. గ్రేటర్‍కు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, ఉన్నతాధికారులు చొరవ చూపితేనే ఈ పనులు త్వరగా పూర్తవుతాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
24.5 మీటర్లతో నయీంనగర్ కొత్త బ్రిడ్జి..
నయీంనగర్ పాత బ్రిడ్జిని అప్పటి జనాభాకు అనుగుణంగా దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించారు. అనంతరం నయీంనగర్ నాలాను ఆనుకుని వందలాది కాలనీలు వెలిశాయి. అదే స్థాయిలో సిటీ జనాభా, ట్రాఫిక్ పెరిగింది. కరీంనగర్ మెయిన్ రోడ్డులో ఉండే ఈ బ్రిడ్జి ఇరుకుగా మారింది. ఏటా వానాకాలంలో దీనిపై పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో కరీంగనర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికులు మొదట్లోనే సిటీ దాటలేని దుస్థితి ఉండేది. దీంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నయీంనగర్ నాలా విస్తరణతో పాటు కొత్త బ్రిడ్జి నిర్మాణానికి స్వీకారం చుట్టింది.
రూ.8.5 కోట్ల స్మార్ట్‌సిటీ ఫండ్స్కేటాయించింది. గతంలో 16 మీటర్ల వెడల్పు ఉన్న నయీంనగర్ బ్రిడ్జిని 24.5 మీటర్ల వెడల్పు చేయనున్నారు. కింది భాగంలో వరదనీరు సాఫీగా వెళ్లేలా 10 మీటర్ల అడుగుతో 3 ఖానాలు ఏర్పాటు చేయనున్నారు. 32 మీటర్ల పొడవు ఉండే బ్రిడ్జి నిర్మాణంలో చివర్లో ఉండే పిల్లర్లతో సంబంధంలేకుండా మధ్యలో 2 బలమైన పిల్లర్లు రానున్నాయి. కాగా, జూన్, జులైలో వానలు కురిసే అవకాశం ఉండటంతో నయీంనగర్ నాలా పనులతో పాటు జూన్ 15 నాటికి కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని భావించారు. కానీ, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
రోడ్ బంద్‍తో ప్రయాణానికి ఇబ్బందులు
సిటీలో నయీంనగర్ రోడ్ అంటేనే ఎంతో బిజీ ఉండే ప్రాంతం. ప్రస్తుతం బ్రిడ్జి పనులు సాగుతుండగా వరంగల్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లేవారు ఈ బ్రిడ్జి ప్రాంతానికి రాగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఇరుకు దారిలో వెళ్లాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, నేటి నుంచి స్కూల్స్తెరుచుకోనుండటంతో మరింతగా ఇబ్బంది కానుంది.
గ్రేటర్ వరంగల్‌లో ప్రధాన స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీలన్నీ నయీంనగర్ బ్రిడ్జికి అటు ఇటు వైపు ఉన్నాయి. ఈ క్రమంలో తాము చదవే స్కూళ్లు, కాలేజీలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా రెండు, మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం తప్పదు. ప్రత్యామ్నాయంగా జనాలు ఇప్పుడు పోచమ్మకుంట రోడ్డు, మరోవైపు సమ్మయ్యనగర్ మీదుగా అంబేద్కర్ భవన్ రోడ్డులో వెళ్తున్నారు. చిన్నపాటి వానలకే ఈ రోడ్లు నీట మునుగుతాయి, వానలు కురిస్తే ఈ రోడ్లపై ప్రయాణం కష్టమే అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పనుల్లో వేగం పెంచాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.
బ్రిడ్జి త్వరగా కట్టాలే..
నయీంనగర్ బ్రిడ్జికి దగ్గర్లోనే దాదాపు 10 పెద్ద స్కూళ్లు, మరో 20–30 కాలేజీలున్నాయి. వేలాది మంది స్టూడెంట్లు క్లాసుల కోసం సకాలంలో వెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యమ్నాయంగా ఉండే రోడ్లు మరీ చిన్నవి. ఒకట్రెండు వానలు పడితే అసలు సమస్య కనిపిస్తది. అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టి పగలు, రాత్రనే తేడా లేకుండా పనులు చేపించాలి. లేదంటే చిన్న పిల్లలకు ఇబ్బందులు, వరద కష్టాలు తప్పవు. ట్రాఫిక్ పోలీసులు శ్రమించకతప్పదు.
- కె.యాదగిరి పోచమ్మకుంట, హనుమకొండ