పనులు ఆగమాగం.. కరీంనగర్ స్మార్ట్ సిటీ, ఇతర పనుల్లో లోపిస్తున్న నాణ్యత

  • క్యూరింగ్ చేయడంలో అలసత్వం 
  • పట్టించుకోని ఇంజనీరింగ్ అధికారులు
  • నాలుగు కాలాలు ఉండేలా పనులు చేపట్టాలని కోరుతున్న జనం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, ఇతర ఫండ్స్ తో చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో పనులు త్వరగా పూర్తి చేయాలని టార్గెట్లు విధిస్తున్న ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు.. క్వాలిటీ సంగతి పట్టించుకోవడం లేదు. నెలల నుంచి పనులు చేపట్టకుండా జాప్యం చేసిన కాంట్రాక్టర్లు, గడువు సమీపిస్తుండడంతో హడావుడి చేస్తూ నాణ్యత గాలికొదిలేస్తున్నారు. కాంక్రీట్ పనులకు క్యూరింగ్ సరిగా చేయకపోవడం, కాంక్రీట్ మిక్సింగ్ లోనూ తక్కువ సిమెంట్ వినియోగిస్తున్నారు. దీంతో పనుల మన్నిక ఎన్నాళ్లుంటుందోనని సిటీ జనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కంప్లీట్ చేయడంపైనే దృష్టంతా.. 

రాష్ట్ర మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్లు అభివృద్ధి పనులపై నిత్యం సమీక్ష చేస్తున్నారు. గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ పనుల్లో నాణ్యతను మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో పలు చోట్ల ఇప్పటికే పూర్తయిన పనులకు సరైన క్యూరింగ్ లేక పగుళ్లు వచ్చాయి. ఫుట్ పాత్ టైల్స్ పలు చోట్ల విరిగిపోతుండగా.. కాంక్రీట్ తో వేసిన రోడ్లు సైతం హెవీ వెహికిల్స్ వెళ్తే ధ్వంసమవుతున్నాయి. కమాన్ జంక్షన్, బాబు జగ్జీవన్ రాం జంక్షన్ బ్యూటీఫికేషన్ పనులు పూర్తయిన మూడేళ్లలోనే పాక్షికంగా దెబ్బతినడం పనుల నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.  

వందల కోట్ల పనులు..  

కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల కింద కరీంనగర్ ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్​కి ఎంపిక చేసింది. నగర​అభివృద్ధికి రూ.1878 కోట్లతో ప్రపోజల్స్ పంపారు. ఇప్పటి వరకు రూ.936 కోట్లతో సీసీ రోడ్లు, రెయిన్ డ్రెయిన్స్, సైడ్ డ్రెయిన్స్, సెంటర్ల బ్యూటీఫికేషన్, ఫుట్ పాత్ లు, పార్కుల అభివృద్ధి, సైక్లింగ్ ట్రాక్, గ్రీనరీ, లైటింగ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ ఫస్ట్, సెకండ్ ఫేజుల్లో కలిపి రూ.230 కోట్ల స్మార్ట్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే రూ.16 కోట్లతో అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.1.25 కోట్ల రోడ్లపై సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. రూ.3.95 కోట్లతో సర్కస్ గ్రౌండ్ ను పార్కుగా అభివృద్ధి చేశారు. మరో 1.50 కోట్లతో నిర్మించాల్సిన వాకింగ్ ట్రాకింగ్ టెండర్ దశలో ఉంది. రూ.5 కోట్లతో పార్కులో  చేపట్టాల్సిన పనులు, రూ.2 కోట్లతో  చేపట్టాల్సిన డిజిటల్ ఇంటి నంబరింగ్ కు, రూ.1.79 కోట్లతో చేపట్టాల్సిన డిజిటల్ లైబ్రరీ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. వీటితోపాటు గత మూడేళ్లలో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.32 కోట్లు, పట్టణ ప్రగతి ఫండ్స్ రూ. 36 కోట్లు, సీఎం హామీ ఫండ్స్ రూ.28 కోట్లు, ఫిఫ్టింత్ ఫైనాన్స్ ఫండ్స్ రూ.3.27 కోట్లు, డీఎంఎఫ్ టీ ఫండ్స్ రూ.కోటిన్నర, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.4.75 కోట్లు, అమృత్ నిధుల నుంచి రూ.1.04 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు.

పనుల్లో నాణ్యత పాటించడం లేదు.. 

ఇప్పుడు వేస్తున్న స్మార్ట్ సిటీ రోడ్ల కంటే పాత రోడ్లు బాగున్నాయి. సిమెంట్ కు బదులు డస్ట్ ఎక్కువగా వాడుతున్నారు. నాసిరకం పనులతో రోడ్డు సర్ఫేస్​పోతోంది. వావిలాపల్లి 42వ డివిజన్ అరుణోదయ చిట్ ఫండ్ దగ్గర వేసిన అప్రోచ్ రోడ్​ఏడాది గడవకముందే ధ్వంసమైంది. ఫుట్ పాత్ లో టైల్స్ వేసిన కొద్ది రోజులకే ఊడిపోతున్నాయి. రెడీమిక్స్ లో కాంక్రీట్ మిక్సింగ్ పై ఆఫీసర్ల పర్యవేక్షణ లేదు.  క్యూరింగ్ ఉండడం లేదు. సిటీలో రాత్రి పూట లైటింగ్ ఉండడం లేదు. 
‌‌‌‌‌‌- అమీర్, ప్రెసిడెంట్, ప్రజాప్రయోజనాల పరిరక్షణ సమితి