- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,559 అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు
- ఇప్పటి వరకు 634 బడుల్లోనే వర్క్స్ కంప్లీట్
- పది రోజుల్లోపు పనులన్నీ పూర్తవుతాయంటున్న అధికారులు
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి పూర్తయ్యేలా లేవు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభం కానున్నాయి. పనులు ప్రారంభించిన వాటిలో 60 శాతానికి పైగా స్కూళ్లలో ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వారం, పది రోజుల్లో మెజార్టీ స్కూళ్లలో పనులు కంప్లీట్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నా.. ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
ఇక్కడ 917.. అక్కడ 642 స్కూళ్లలో పనులు
ఖమ్మం జిల్లాలో 917 పాఠశాలల్లో పనుల కోసం రూ.30 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పటి వరకు రూ.14.5 కోట్లు రిలీజ్ చేశారు. 330 స్కూళ్లలో పనులు కంప్లీట్ కాగా, మరో 587 స్కూళ్లలో కొనసాగుతున్నాయి. మరో 10 రోజుల్లో 500 స్కూళ్లలో పనులు పూర్తి అవుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతలో 642 స్కూళ్లను సెలెక్ట్ చేశారు. పాఠశాలల ప్రారంభం నాటికి రెండు రోజుల ముందుగా పనులు పూర్తి చేసేలా 25 శాతం ఫండ్స్‌ను అడ్వాన్స్‌గా రిలీజ్ చేశారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 304 స్కూళ్లు మాత్రమే పెయింటింగ్ దశకు చేరుకున్నాయి. కనీసం ఈ నెల 20లోపు పనులు నూరు శాతం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు.
ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా..
ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడులను ఆకర్శణీయంగా తీర్చిదిద్దడంతో పాటు స్టూడెంట్స్ ను ఆకట్టుకునేలా సిద్ధం చేయడమే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పనులు చేపట్టారు. ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటుచేసి, వారికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు అప్పగించారు. వీటిలో భాగంగా పెయింటింగ్, డ్యుయల్ డెస్క్‌లు, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవన్నీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో భాగంగా గవర్నమెంట్ సప్లై చేయాల్సి ఉంది. కానీ స్కూళ్లు స్టార్ట్ కానున్నప్పటికీ పనులేవీ పూర్తి స్థాయిలో కాలేదు.
కొన్ని పాఠశాలలను పరిశీలిస్తే..
కూసుమంచి మండలంలో గురువాయిగూడెం తండా యూపీఎస్ స్కూల్ కు రూ.25 లక్షలు మంజూరు చేశారు. కరెంట్ మీటర్, లైట్లు, ఫ్యాన్లు బిగించారు. మిగిలిన మైనర్ వర్క్ కు రూ.1.90 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ డబ్బులు రాలేదు. ఇందులో టాయిలెట్లు, బాత్ రూమ్ డోర్స్, కిటికీలు తదితర పనులు మిగిలి ఉన్నాయి.
కారేపల్లి మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలలుగా 44 ప్రభుత్వ స్కూళ్లకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో తాగునీరు సరఫరా, విద్యుత్ పనులు, టాయిలెట్ల నిర్మాణం, ఇతర రిపేర్లు చేపట్టాల్సి ఉంది. ఏ ఒక్క పాఠశాలలో పూర్తి పనులు జరగలేదు. కారేపల్లి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి రూ.24 లక్షలు మంజూరు కాగా, పనులను ఇటీవలే ప్రారంభించారు. పాఠశాలలోని ఐదు గదుల్లో, వరండాలో కుంగిన బండలన్నీ తీసేసి టైల్స్ వేయాల్సి ఉంది. నాపరాళ్లన్నీ తొలగించారు.. కానీ ఇంకా టైల్స్ వేయలేదు. టాయిలెట్స్, బాత్రూమ్స్ నిర్మించాల్సి ఉంది. కేవలం ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు మాత్రమే బిగించారు. ఇక్కడ పనులన్నీ పూర్తి కావడానికి మరో నెల రోజులు పడుతుంది. 320 మంది బాలికలు ఉన్న ఈ స్కూల్లో పనులు ఆలస్యం వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.
కల్లూరు మండల పరిధిలో పనులు పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ అధికారులు రిపేరు పనుల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో సదరు పాఠశాలలో పనులు తూతూ మంత్రంగా, నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పాఠశాలలు ప్రారంభం అయ్యే వరకు పనులు పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు.
పెనుబల్లి మండలంలో అమ్మ ఆదర్శ బడుల పనులు పూర్తి కావడానికి ఇంకా 20 రోజుల వరకు పడతాయని అధికారులు అంటున్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ పనులు మాత్రం ఇంకా నెల రోజుల పైన పట్టే అవకాశం ఉంది. గ్రామాలలో బడుల తాళాలు టీచర్లు ఇవ్వకపోవడంతో పనులు లేట్ గా మొదలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి 50శాతం పనులు పెండింగ్ లోనే ఉండనున్నాయి.
పది రోజుల్లో పనులు కంప్లీట్ చేస్తాం..
అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ఖమ్మం జిల్లాలో 330 స్కూళ్లలో ఇప్పటికే వర్క్ లు కంప్లీట్ చేశాం. ఇంకా 587 స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి. ఇందులో 90 శాతం స్కూళ్లలో వారం, పది రోజుల్లోనే పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మిగిలిన స్కూళ్లలో కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు పనులు జరుగుతున్న స్పీడ్ లో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొదటిస్థానంలో ఉంది.
- సోమశేఖర శర్మ, డీఈవో, ఖమ్మం
భారంగా ‘మన ఊరు–మన బడి’ వర్క్స్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఫండ్స్ సరిగా ఇవ్వకుండా పనులు చేపట్టాలని బీఆర్ఎస్ సర్కార్ పేర్కొనడంతో అటు కాంట్రాక్టర్లతో పాటు ఇటు ఇంజినీరింగ్ ఆఫీసర్లకు పనులు పూర్తి చేయడం తలనొప్పిగా మారింది. చేసిన పనులకే డబ్బులు రాలేదు, మిగిలిన పనులెట్లా చేయాలని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ‘మన ఊరు–మన బడి’ కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో 368 స్కూల్స్ ఎంపిక కాగా దాదాపు 96 స్కూళ్లలో పనులు పెండింగ్‌లో ఉన్నాయి.