- పూర్తయితే 8 ఎంజీడీల నీరు ఆదా.. మరో 14 ఎంజీడీల సరఫరాకు అవకాశం
- ఇన్నేండ్లు సరఫరాకు బ్రేక్ పడుతుందని రిపేర్లు చేయని ఆఫీసర్లు
- పదేండ్ల నుంచి నీళ్లు వృథా
హైదరాబాద్‌సిటీ, వెలుగు: చారిత్రక గండిపేట కాండ్యూట్(కాలువ)ను పదేండ్లుగా వేధిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కెమికల్ట్రీట్మెంట్ ద్వారా లీకేజీకి చెక్ పెట్టాలని వాటర్‌బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులను బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్నగర్ఫిల్టర్బెడ్స్వరకు గ్రావిటీ కెనాల్‌ద్వారా నీటిని సరఫరా చేస్తారు. దాదాపు15 కిలోమీటర్ల మేర ఎలాంటి పైప్లైన్లు లేకుండా కెనాల్‌ద్వారా నీటిని పంపింగ్‌చేస్తున్నారు. అయితే గండిపేట, కోకాపేట, మణికొండ, సీబీఐటీ కాలేజీ, పుప్పాలగూడ, జానకీనగర్, కౌసర్ కాలనీ, ఎంఈఎస్ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. వీటి నుంచి పదేండ్లుగా నీళ్లు వృథాగా పోతున్నాయి.
లీకేజీలకు రిపేర్లు చేయాలంటే కనీసం నెల రోజుల పాటు నీటి సరఫరా బంద్చేయాల్సి ఉంటుంది. దీంతో అధికారులు చేయించలేదు. రిపేర్లను వాయిదా వేస్తూ వస్తున్నారు. నీటి సరఫరాకు ఆటంకం కాకుండా రిపేర్లు చేసే టెక్నాలజీ కోసం అధికారులు ఇంతకాలం అన్వేషించారు. ఎట్టకేలకు చెన్నైకి చెందిన ఓ కంపెనీ జర్మన్ టెక్నాలజీతో సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా లీకేజీలు అరికట్టేందుకు ముందుకు వచ్చింది. 40 రోజుల కింద ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్కాండ్యూట్కు10 మీటర్ల మేర గ్రౌటింగ్ ద్వారా రిపేర్లు చేపట్టి పూర్తిచేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే పనులు చేయాలని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఎలా చేస్తారంటే...
లీకేజీ ఏర్పడిన ప్రాంతంలో మొదట ప్రత్యేక పరికరాలతో నీటిని ఖాళీ చేసి.. ఆ ప్లేస్‌లోకి ఓ కెమికల్పంపుతారు. అది క్షణాల్లో ఘన పదార్థంగా మారి ఖాళీ ప్రాంతంలో పూడుకుపోతుంది. దీంతో లీకేజీ ఆగిపోతుంది. ఈ పద్ధతి ద్వారా నీటి సరఫరాను మొత్తానికే నిలిపివేయకుండానే రిపేర్లు చేస్తున్నారు. గండిపేట నుంచి సిటీకి మొత్తం 26 ఎంజీడీల తాగునీటిని సరఫరా చేయొచ్చు. అయితే, ప్రస్తుతం 20 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు.
ఇందులో 8 ఎంజీడీలు లీకేజీల వల్ల వృథాగా పోతున్నాయి. చివరికి 12 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. దాదాపు 14.5 కిలోమీటర్ల మేర 45 ప్రాంతాల్లో లీకేజీలు ఉన్నట్లు వాటర్‌బోర్డు అధికారులు గుర్తించారు. ఎండీ అశోక్ రెడ్డి సరఫరాపై ప్రభావం పడకుండా రిపేర్లు పూర్తిచేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ రిపేర్లు పూర్తయితే అదనంగా మరో 14 ఎంజీడీల నీటిని వినియోగదారులకు సరఫరా చేయొచ్చు.