ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ నిధులు

ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి  వరల్డ్ బ్యాంక్ నిధులు
  • ఢిల్లీ వెళ్లి బ్యాంకు ప్రతినిధులతో అధికారుల చర్చలు 
  • మొత్తం కాస్ట్​లో 30 శాతం ఫండ్స్ ఇచ్చేందుకు ఓకే  
  • సింగరేణి ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులు 
  • ఒక్కో నిర్మాణానికి రూ.30 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ 
  • బడ్జెట్ లో రూ.2,900 కోట్లు కేటాయింపు 
  • కొడంగల్, మధిర, హుజూర్ నగర్ గురుకులాలకు త్వరలో టెండర్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాల క్యాంపస్ ల నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ రానున్నాయి. ఈ అంశంపై ఇటీవల ఢిల్లీ వెళ్లి వరల్డ్ బ్యాంక్ అధికారులను కలిసిన టీఎస్ఈడబ్ల్యూఐడీసీ అధికారులు  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా మొత్తం ప్రాజెక్టు కాస్ట్ లో 30% ఫండ్స్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎక్కువ తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బ్యాంకు ప్రతినిధులతో మరోసారి భేటీ కావాలని అధికారులు నిర్ణయించారు. 

సింగరేణి నుంచి సీఎస్ఆర్ ఫండ్స్

రాష్ర్టంలో సింగరేణి మైన్స్ ఉన్న ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ఫండ్స్ ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సీఎస్ఆర్) ప్రోగ్రాం కింద ఒక్కొ క్యాంపస్ కు రూ.30 కోట్లు ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.  

గ్రీన్‌‌ సిగ్నల్ రాగానే టెండర్లు ఓపెన్

ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఇటీవల రెండోసారి టెండర్లను పిలిచింది. తొలి దశలో వికారాబాద్ జిల్లా కొడంగల్, ఖమ్మం జిల్లా మధిర, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. మూడు గురుకులాలకు తొలి సారి పిలిచినపుడు మూడు టెండర్లు ( సింగిల్ టెండర్లు) మాత్రమే రావడంతో ఇటీవల మరోసారి పిలిచారు. రెండోసారి ఆరు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. 

కంపెనీ అర్హతలు, యాన్యువల్ టర్నోవర్, గతంలో చేసిన ప్రాజెక్టుల వంటి అంశాలను పరిశీలించేందుకు ఈ టెండర్లను సీవోటీ (కమిషనరేట్ ఆఫ్ టెండర్స్)కు కార్పొరేషన్ అధికారులు పంపించారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లు ఓపెన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మే లేదా జూన్ నుంచి గురుకులాల నిర్మాణం స్టార్ట్ చేయాలని టెండర్ దక్కించుకున్న కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఈ టెండర్లు ఓపెన్ చేయగానే మిగతా గురుకులాలకు కూడా కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలవనున్నారు.

24 వేల కోట్లు కావాలి.. 

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులాల చొప్పున ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో గురుకులానికి భవనాల నిర్మాణ ఖర్చు రూ.200 కోట్లు అవుతుందని అంచనా వేసింది. అన్ని క్యాంపస్​కు కలిపి రూ.23,800 కోట్లు  నిధులు అవసరం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల నుంచి ఈ నిధులు గురుకులాల నిర్మాణ బాధ్యతలు చూస్తున్న విద్యా శాఖ అనుబంధ కార్పోరేషన్ టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్)కు బదిలీ కానున్నాయి. 

ఇప్పటికే కొడంగల్, మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 600 కోట్లకు అడ్మినిష్ట్రేషన్ సాంక్షన్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో మరో 55 గురుకులాలకు ఒక్కో క్యాంపస్​కు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ. 11 వేల  కోట్లకు అడ్మినిస్ర్టేటివ్ సాంక్షన్ ఇస్తూ విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా జీవో జారీ చేశారు. ఇటీవలి బడ్జెట్​లో రూ.2,900 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే, వచ్చే 4 ఏళ్లలో అన్నీ పూర్తి చేయాలంటే ప్రభుత్వానికి నిధుల ఇబ్బందులు ఉన్నాయని అధికార వర్గాల్లో చర్చ జరగుతోంది.