
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అనేది ఐదు సంస్థల కలయిక. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్(ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్(ఐడీఏ), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్సీ), మల్టీలేటరల్ ఇన్వెస్టిమెంట్ గ్యారంటీ ఏజెన్సీ(ఎంఐజీఏ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ డిస్ప్యూట్స్(ఐసీఎస్ఐడీ). భారతదేశానికి ఐసీఎస్ఐడీలో తప్ప మిగిలిన నాలుగింటిలో సభ్యత్వం ఉంది. ప్రపంచ బ్యాంక్ సభ్యత్వం కావాలంటే మొదట అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సభ్యత్వం అవసరం. ప్రపంచ బ్యాంక్ ప్రదాన కేంద్రం వాషింగ్టన్లో ఉన్నది.
ఐబీఆర్డీ
ఇది ప్రపంచ బ్యాంక్ సంస్థల్లో పురాతనమైంది. ఐఎంఎఫ్–ఐబీఆర్డీలను బ్రెటన్ ఉడ్స్ కవలలు అని పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు ఐబీఆర్డీ ఉద్దేశించింది. ఆర్థిక పునర్నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. 1945లో వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా ఐబీఆర్డీ ప్రారంభమైంది. 1946 నుంచి పనిచేస్తోంది. దీనినే వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు. ఐఎంఎఫ్ సభ్య దేశాలన్ని ఐబీఆర్‌డీలో సభ్య దేశాలే. ఐఎంఎఫ్లో సభ్యత్వం రద్దయితే ఐబీఆర్డీలోనూ సభ్యత్వం పోయినట్లే. అయితే, 75 శాతం సభ్యులు అనుమతి ఇస్తే ఐఎంఎఫ్లో సభ్యత్వం రద్దయినా ఐబీఆర్‌డీలో కొనసాగవచ్చు. ఐబీఆర్ డీలో రెండు రకాల సభ్యులు ఉంటారు. 1. 1945, డిసెంబర్ 31 నాటికి ఉన్న ఫౌండర్ మెంబర్స్. భారతదేశంలో కూడా ఇందులో ఉన్నది. 2. సాధారణ సభ్యులు.
విధులు
మధ్య ఆదాయ, పరపతి సౌకర్యం గల అల్ప ఆదాయ దేశాలకు రుణాలను అందిస్తుంది.
పెద్ద మొత్తాల్లో దీర్ఘకాలిక రుణాలు తక్కువ వడ్డీ రేటుతో అందిస్తుంది.
అవినీతి వ్యతిరేక, సురక్షిత వలయానికి చెందిన సంస్థాగత సంస్కరణలను ప్రోత్సహిస్తుంది.
విత్త సంక్షోభ సమయంలో సహాయాన్ని అందిస్తుంది.
వ్యవసాయం, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ కుటుంబ సంక్షేమం, డైరీ డెవలప్మెంట్ రంగాలకు ఇది రుణాలను అందిస్తుంది. భారతదేశానికి 1949 నుంచి భారత రైల్వేలకు రుణాలను అందిస్తుంది.
ఓటింగ్ హక్కు అనేది బ్యాంకు మూలధనంలో వాటాను అనుసరించి ఉంటుంది. ప్రతి సభ్య దేశానికి 250 ఓట్లు, ప్రతి లక్ష షేర్లకు ఒక ఓటు ఉంటుంది. భారతదేశ ఓట్లు 82,916. ఇది మొత్తం ఒఓట్లలో 3.08 శాతం. భారతదేశం ఏడో స్థానంలో ఉన్నది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి.
ఐడీఏ
1960లో ఐడీఏను ఏర్పాటు చేశారు. భారతదేశం ప్రారంభ సభ్యదేశం. దీనిని సాఫ్ట్ విండో లేదా సాఫ్ట్ లెండింగ్ ఆర్మ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అంటారు. వెనుకబడిన పేద దేశాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఈ రుణాలు 35 నుంచి 40 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. ఐదు నుంచి 10 సంవత్సరాల గ్రేస్ కాలంతో కలిపి. పాలనా వ్యయాల కోసం కొన్ని చార్జీలను వసూలు చేస్తారు. ఈ రుణాలు అవసరమైతే ఆయా దేశాలు తమ సొంత కరెన్సీలోనూ చెల్లించవచ్చు. అందుకే ఐడీఏను సాఫ్ట్ లోన్ విండో అని పిలుస్తారు. ఐబీఆర్డీ రుణాలు 20 నుంచి 35 ఏండ్లలో తిరిగి చెల్లించాలి.
2023 నాటికి ఏ దేశాల తలసరి ఆదాయం 1255 డాలర్లు కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలు మాత్రమే దీని కింద రుణాలు పొందడానికి అర్హులు. ఇండియా తలసరి ఆదాయం 2,277 డాలర్లు. కొన్ని దేశాల తలసరి ఆదాయం కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉన్నా, పరపతి సౌకర్యం లేక ఐఆర్ డీబీ నుంచి రుణాలు పొందలేవు. వాటికి కూడా ఐడీఏ సహాయం చేస్తుంది. నైజీరియా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు తలసరి ఆదాయం బట్టి ఐడీఏ నుంచి, క్రెడిట్ వర్తి బట్టి ఐబీఆర్డీ రుణం పొందడానికి అర్హతను కలిగి ఉన్నాయి. వీటిని బ్లెండ్ కంట్రీస్ అంటారు.
ఐడీఏ భారతదేశానికి హరిత విప్లవం, శ్వేత విప్లవం, పోలియో, టీబీ నివారణ వంటి అంశాల్లో సహాయాన్ని అందించింది. ఐడీఏ మద్దతు నుంచి భారతదేశం ఎక్కువ లబ్ధి పొందింది. అయితే, 2015 నుంచి ఎలాంటి మద్దతును తీసుకోలేదు. కారణం 2014లో భారతదేశాన్ని గ్రాడ్యుయేట్‌గా ప్రకటించారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా తలసరి ఆదాయం ఆపరేషనల్ కట్ ఆఫ్‌ను మించిపోతే ఆ దేశాన్ని గ్రాడ్యుయేట్‌గా పిలుస్తారు. ఈ హోదాను 2020 నాటికి 37 దేశాలు పొందాయి.
ఎంఐజీఏ
1988లో ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. కరెన్సీ బదిలీలు, ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు దృష్ట్యా ఆస్తులను తీసుకోవడం, యుద్ధం, పౌర అశాంతి వంటి రాజకీయ నష్టభయ సమయంలో విదేశీ పెట్టుబడిదారులకు బీమా/ భద్రతను అందిస్తుంది. పెట్టుబడిదారులకు పెట్టుబడి అవకాశాలపై సమాచారం, సాంకేతికత సహాయం అందిస్తుంది.
ఐసీఎస్ఐడీ
1966లో ఏర్పడింది. విదేశీ పెట్టుబడిదారులకు, పెట్టుబడుల స్వీకరించిన దేశాలకు మధ్య ఏర్పడే వివాదాలు పరిష్కరిస్తుంది. ఇందులో ఇండియా సభ్యత్వాన్ని తీసుకోలేదు. దీని ద్వారా వివాద పరిష్కారం స్వచ్ఛందం. అయితే, రెండు పార్టీలు ఒకసారి ఒప్పుకుంటే ఏకపక్షంగా ఒప్పందాన్ని తిరస్కరించరాదు.
ఐఎఫ్సీ
1956లో ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేట్ రంగ పరిశ్రమలకు రుణ సదుపాయాన్ని అందిస్తుంది. బలమైన ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులను, సాంకేతిక నిపుణులను, సలహా సేవలను అందిస్తుంది. అందుకే దీనిని ప్రైవేట్ ఆర్మ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ అంటారు. దేశ, విదేశీ ప్రైవేట్ పెట్టుబడులకు సౌకర్యాలను కల్పిస్తుంది. ప్రైవేట్ వ్యవస్థాపకులకు, వ్యాపారవేత్తలకు, ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతు అందిస్తుంది. వాణిజ్యపర వడ్డీ రేటు విధించినా సాపేక్షంగా పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అంతర్జాతీయ విత్త మార్కెట్లో బాండ్లు జారీ చేయడం ద్వారా ఐఎఫ్సీ నిధులు సమకూర్చుకుంటుంది. ఉదాహరణకు అమెరికా డాలర్ బెంచ్ మార్క్ బాండ్, లోకల్ కరెన్సీ బాండ్స్. 2014లో ఐఎఫ్ సీ రూపీ బాండ్, ఎంఏఎస్ఏఎల్ఏ బాండ్ల ద్వారా భారత కంపెనీలకు విత్తాన్ని సమకూర్చింది.
ఎంఏఎస్ఏఎల్ఏ బాండ్స్: భారత కరెన్సీలో ద్రవ్యాన్ని సమకూర్చుకునేందుకు భారత కంపెనీలు విదేశీ మార్కెట్లో జారీ చేసే రుణ సాధనం. 2014లో మొదటి మసాలా బాండ్‌ను భారతదేశంలో అవస్థాపనా సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఐఎఫ్సీ జారీ చేసింది.
ప్రపంచ బ్యాంక్ ప్రచురణలు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్
1978 నుంచి ఐబీఆర్ డీ(ప్రపంచ బ్యాంక్) వార్షికంగా ప్రచురిస్తున్నది. డబ్ల్యూడీర్ 2022 గృహరంగం, వ్యాపార రంగం, విత్త సంస్థలు, ప్రభుత్వం, కొవిడ్–19 సంక్షోభంలో ఎదుర్కొన్న నష్టభయాలు ఏవిధంగా అంతర సంబంధాన్ని కలిగి ఉన్నవి తెలియజేస్తుంది. ఈ నివేదిక ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ అన్ ఈక్విటబుల్ రికవరీ పై దృష్టి కేంద్రీకరిస్తుంది.
డూయింగ్ బిజినెస్ రిపోర్ట్
(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్)
చివరి ఈఓడీబీ నివేదిక 2020లో భారత్ ర్యాంక్ 63.
గ్లోబల్ ఎకనామిక్ ప్రాజెక్ట్ రిపోర్ట్
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పోకడలను పరిశీలిస్తుంది. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఏడాదికి గ్లోబల్ ఎకనామిక్ ప్రాజెక్టును రెండుసార్లు ప్రచురిస్తుంది.
గ్లోబల్ ఫిన్ డెక్స్ డేటా బేస్
విత్త సమ్మిళితంపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. 2011 నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు దీన్ని ప్రచురిస్తున్నారు. దీనికి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందిస్తుంది.
పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్ట్
ప్రపంచ పేదరికాన్ని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది.