- డ్యామ్ ను సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. రెండు రోజులుగా డ్యామ్‌ను పరిశీలించిన సభ్యులు మంగళవారం ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. గేట్ల దిగువన ప్లంజ్ ఫూల్ వద్ద ఏర్పడిన గొయ్యి, అప్రోచ్ రోడ్డు, డ్యామ్ గేట్లు, కొండ చరియలు విరిగిపడకుండా తీసుకునే చర్యలపై చర్చించారు. ప్రపంచ బ్యాంక్ ద్వారా ఫేజ్–1 కింద డ్యామ్ రిపేర్ల కోసం రూ.103 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా బృందం సభ్యులు డ్యామ్ వద్దకు వెళ్లి డ్యామ్ సేఫ్టీ గురించి ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు సీఈ కబీర్ బాషా, డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ నూతన కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యామ్ రిపేర్ల కోసం ఫేజ్–1 కింద రూ.103 కోట్లు మంజూరుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆమోదం తెలిపారని చెప్పారు. వచ్చే నెల టెండర్లు పిలుస్తామన్నారు. భారీ వరదల వల్ల డ్యామ్ ముందు భాగంలో ప్లంజ్ పూల్ వద్ద 46 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడిందన్నారు.
దీన్ని పూడ్చేందుకు రూ.10 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. జలాశయం అప్రోచ్ రోడ్డు, కొండ చరియల రిపేర్లు చేస్తామని చెప్పారు. 2011 నుంచి 2024 వరకు పూడిక ద్వారా ప్రాజెక్టులో 9 టీఎంసీలు నీరు తగ్గిందన్నారు. రానున్న మూడేండ్లలో పూడికపై అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు.