
- రాబోయే సంవత్సరాల్లో మరింత వేగంగా అభివృద్ధి
- ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌లో వెల్లడి: ప్రధాని నరేంద్ర మోదీ
- సౌరశక్తిలో సూపర్ పవర్‌గా ఇండియా
- మధ్యప్రదేశ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్‌లో ప్రధాని ప్రసంగం
భోపాల్: ఆర్థిక రంగంలో భారత్ పరుగులు పెడుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ భారత్ ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌లో చెప్పినట్టు గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సోమవారం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో ప్రధాని మోదీ పాల్గొని, మాట్లాడారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని అన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థలకు దేశం టాప్ సప్లై చెయిన్‌గా ఎదుగుతున్నదని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో టెక్స్టైల్స్, టూరిజం, టెక్నాలజీ రంగాలు కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. సోలార్ ఎనర్జీలో భారత్ సూపర్ పవర్‌గా మారిందని యునైటెడ్ నేషన్(యూఎన్)కు చెందిన ఓ విభాగం ప్రశంసించిందని తెలిపారు.
ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే.. భారత్ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థే పేర్కొన్నదని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయని తెలిపారు. దేశంలో హెల్త్ అండ్ వెల్‌నెస్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ‘హీల్ ఇన్ ఇండియా’ మంత్రాన్ని ప్రపంచం ఇష్టపడుతున్నదని అన్నారు.
కాగా, 10,12వ తరగతుల స్టూడెంట్లకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని, వారి పరీక్షకు వెళ్లే సమయం కావడంతో.. తాను ఈ కార్యక్రమానికి లేట్‌గా బయలుదేరానని మోదీ అక్కడున్నవారికి తెలిపారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరారు.
ఎంపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రంలో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆకర్షించడమే లక్ష్యంగా 18 కొత్త పాలసీలను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ జనాభాపరంగా ఐదో అతిపెద్ద రాష్ట్రమని, వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందువరుసలో ఉన్నదని మోదీ చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
ఒబెసిటీ వ్యతిరేక ప్రచారానికి 10 మంది పేర్లు..
దేశంలో ఒబెసిటీపై పోరాటానికి ప్రధాని మోదీ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు మోహన్‌లాల్ ఉన్నారు. అలాగే, భోజ్‌పురి సింగర్ నిరహువా, షూటర్మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్‌నిలేకని, యాక్టర్ ఆర్. మాధవన్, సింగర్ శ్రేయ ఘోషాల్, ఎంపీ సుధామూర్తిని మోదీ నామినేట్ చేశారు.
ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్ట్ పెట్టారు. ‘‘ఒబేసిటీకి వ్యతిరేకంగా మన పోరాటాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆహారంలో ఆయిల్ వాడకాన్ని తగ్గించడంపై అవగా హన కల్పించేందుకు వీరిని నామినేట్ చేస్తున్నా. వీరంతా ఒక్కొక్కరూ 10 మంది చొప్పున వ్యక్తులను నామినేట్ చేయాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.