D Gukesh: స్వదేశానికి చేరుకున్న చెస్ రారాజు గుకేశ్.. ఘన స్వాగతం

D Gukesh: స్వదేశానికి చేరుకున్న చెస్ రారాజు గుకేశ్.. ఘన స్వాగతం

ఇటీవల సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్‌ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో గుకేశ్‌ ఆఖరి మెట్టుపై విజయం సాధించాడు. ఈ విజయానంతరం గుకేశ్ సోమవారం (డిసెంబరు 16) స్వదేశానికి చేరుకున్నారు. తండ్రి డాక్టర్ రజనీకాంత్‌తో కలిసి చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టిన అతనికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, ఆట పాటలతో అతన్ని అలరించారు. 

ఇదిలావుంటే, 18 ఏళ్ల వయస్సులో చారిత్రాత్మక విజయం సాధించిన గుకేశ్‌‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అతని అసమాన పోరాటాన్ని, ప్రతిభను, పట్టుదలను భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పౌరులందరూ ప్రశంసించారు. గుకేశ్ విజయం భారతదేశ చెస్ చరిత్రలో చిరస్థాయిగా నిలవడమే కాకుండా మిలియన్ల మంది యువకులకు స్ఫూర్తినిచ్చిందంటూ అతన్ని కీర్తించారు.

ఛాంపియన్‌ అవ్వాలని ఆరోజే నిశ్చయించుకున్నా..: గుకేశ్ 

ప్రపంచ టైటిల్‌ కైవసం చేసుకోవాలనే ఆకాంక్ష తనలో ఎప్పుడు, ఎక్కడ పుట్టిందో గుకేశ్ వెల్లడించాడు. 2013లో మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి.. తనను భారత్‌కు టైటిల్‌ని తీసుకురావడానికి ప్రేరేపించిందని గుకేశ్ వెల్లడించాడు.

ALSO READ | Gukesh: ఇప్పుడే నా కెరీర్ మొదలైంది: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజయం తర్వాత గుకేష్

"2013లో చెన్నైలో జరిగిన చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సమయంలో, నేను విషీ సర్(విశ్వనాథన్ ఆనంద్), మాగ్నస్‌ కార్ల్‌సెన్లను చూసి ఆ సమయంలో అక్కడ ఉండటం బాగుందని అనిపించింది. నిజానికి అక్కడ కూర్చుని నా పక్కన భారత జెండాను చూసి ఎంతో మురిసిపోయాను. ఆ క్షణంలో నాలో కలిగిన భావోద్వేగాలు మాటల్లో చెప్పలేను. జీవితంలో అదొక అత్యుత్తమ క్షణం. కానీ విషీ సర్ ఓటమి నన్ను బాధించినప్పటికీ, ఏదో ఒకరోజు దేశానికి టైటిల్‌ను తీసుకురావాలన్న కోరికను పుట్టించింది.." అని గుకేశ్ అన్నారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచిన గుకేష్‌కు 11 కోట్ల రూపాయల బహుమతి లభించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం అతనికి రూ.5 కోట్ల రివార్డు ప్రకటించింది.