చెన్నై: అత్యంత చిన్న వయసులో వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచి స్వదేశానికి తిరిగొచ్చిన ఇండియా గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు ఘన స్వాగతం లభించింది. సింగపూర్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్ సోమవారం తన హోమ్ టౌన్ చెన్నై చేరుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, అధికారులు అతనికి సాదర స్వాగతం పలికారు.
గుకేశ్ చిన్నప్పుడు చదివిన స్కూల్ ఏర్పాటు చేసిన సమావేశంలో అతడిని గజ మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గుకేశ్ చెస్ చాంపియన్‌షిప్ అనేది కేవలం ఆట మాత్రమే కాదని.. ఇది మానసిక, భావోద్వేగ సవాళ్లతో కూడిన పోరు అని అన్నాడు. ఈ విషయంలో మెంటల్ కండిషనింగ్ కోచ్ పాడీ ఆప్టన్ నేర్పించిన టెక్నిక్స్ తనకు ఎంతో సాయం చేశాయని చెప్పాడు.
2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాకు, పారిస్‌లో కాంస్యం గెలిచిన మెన్స్ హాకీ టీమ్‌కు పని చేసిన ఆప్టన్ సూచనలు, అతనితో జరిపిన సంభాషణలు చెస్ ప్లేయర్‌గా తన వృద్ధిలో కీలక పాత్ర పోషించాయని తెలిపాడు. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ నెగ్గి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించినప్పటి నుంచి ఆప్టన్ సేవలు తీసుకున్నానని, తన జట్టులో అతను అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మారాడని గుకేశ్ పేర్కొన్నాడు.