![వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మానియా హాస్పిటల్ : మంత్రి దామోదర రాజనర్సింహ](https://static.v6velugu.com/uploads/2025/01/world-class-facilities-at-new-osmania-hospital_knuxOBqDvo.jpg)
- 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్
- స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు
- 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ.. మోడ్రన్ మార్చురీ
- ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు
- గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నస్టిక్ సేవలు
- పేషెంట్ అటెండెంట్ల కోసం ఆస్పత్రి ఆవరణలోనే ధర్మశాల
- హాస్పిటల్ నిర్మాణంపై అధికారులతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, కోట్ల మంది ప్రజలు కొత్త ఉస్మానియా దవాఖాన కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారని, వారందరి కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందన్నారు. హాస్పిటల్ నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని అధికారులకు మంత్రి సూచించారు. తమకు ఉన్న 38 ఎకరాల స్థలంలో 26.30 ఎకరాలను హాస్పిటల్ కోసం ఇచ్చిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు, గోషామహల్ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన స్థలంలో పోలీసులు తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహించుకోవచ్చునని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్‌కు వేదిక అవుతున్న గోషామహల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, ఈ ప్రాంతం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సెక్రటేరియెట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఉస్మానియా హాస్పిటల్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. 26.30 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో విశాలమైన హాస్పిటల్ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ హాస్పిటల్ లో మొత్తం 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌లో 22 డిపార్ట్‌మెంట్లు ఉండగా, అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లు కొత్త ఉస్మానియాలో ప్రారంభిస్తామని తెలిపారు.
టెస్టులన్నీ ఒకే చోట
పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నస్టిక్సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఓపీ సేవలు అందించాలని సూచించారు. ప్రతి డిపార్ట్‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. కిడ్నీ, లివర్, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం కొత్త ఉస్మానియాలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
స్టూడెంట్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే హాస్టల్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఉండాలని, కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున, ఇందుకు తగ్గట్టుగా ఓపీ కౌంటర్లు ఉండాలని సూచించారు. ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే ప్రసక్తే ఉండకూడదన్నారు. అలాగే, హాస్పిటల్‌లో ప్రతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చేలా హాస్పిటల్ భవనాలను డిజైన్ చేయించామని వివరించారు.
అటెండెంట్ల కోసం ధర్మశాల, ఉచిత భోజనం
పేషెంట్ల సహాయకుల కోసం ఆస్పత్రి ఆవరణలోనే ధర్మశాలను నిర్మించబోతున్నామని మంత్రి దామోదర వెల్లడించారు. ఇక్కడ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. హాస్పిటల్ శానిటేషన్, టాయిలెట్ల నిర్వాహణ కోసం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని, కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో కొత్త ఉస్మానియా ఉంటుందని తెలిపారు. ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ కూడా కొత్త ఉస్మానియాలో అందుబాటులో ఉంటాయన్నారు. హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా హాస్పిటల్‌కు కేటాయించిన స్థలంలోనే నలువైపులా విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు.
వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్‌లో రెండు అంతస్తులను డిజైన్ చేశామని చెప్పారు. దేశంలోనే అత్యంత విశాలమైన పార్కింగ్ వ్యవస్థ కలిగిన హాస్పిటల్‌గా ఉస్మానియా రికార్డుల్లోకి ఎక్కబోతున్నదని తెలిపారు. హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీ, వసతులతో కూడిన మార్చురీని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఇందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని
అధికారులను మంత్రి ఆదేశించారు.